Wednesday 30 May 2018

మహానటి సావిత్రి

సావిత్రి అంటే తెలుగు సినీ ప్రేక్షకులకి ఒక మహానటి. సావిత్రి అంటే పార్వతి, మిస్సమ్మ, దేవత లాంటి భార్య, గుండమ్మ సవతి కూతురు, సైరంధ్రి లాంటి అనేకమైన పాత్రలు. వీటన్నిటికి మించి సావిత్రి అంటే శశిరేఖ, సావిత్రి అంటే ఘటోత్కచుడు. ఈ నాటి హీరోయిన్లు ఎవరైనా నటన నేర్చుకోవాలంటే ఒక్క మాయబజార్ లోని సావిత్రిని చూసి నేర్చుకుంటే చాలు. అంతకంటే వేరే డిక్షనరీ, ఎన్‌సైక్లోపీడియా అవసరం లేదు. అయితే సావిత్రి తెర మీద అద్భుతంగా నటిస్తే, ఆమె బంధుమిత్రులు ఆమె ముందే ఇంకా బాగా నటించి ఆమెని మోసం చెయ్యటం విధివిలాసం.



 

నాగ్ అశ్విన్ మొదటి సినిమా "ఎవడే సుబ్రహ్మణ్యం" చూసినప్పుడే నేను అతని అభిమాని అయిపోయాను, అంత బాగా తీసాడు ఆ సినిమాని. చాలా సిన్సియర్‌గా తీసాడు. అలాంటి దర్శకుడు సావిత్రి బయోపిక్ తీస్తున్నాడంటే ఆశ్చర్యపోయాను. గత సినిమా అనుభవరీత్యా, అతను ఒక బయోపిక్ తీస్తున్నాడంటే ఏడు ఖండాలలోని ఏడు శిఖరాలు అధిరోహించిన మన తెలుగు వాడు, కీర్తిశేషుడు మల్లి మస్తాన్ బాబు బయోపిక్ తియ్యాలి. ఇప్పుడు సావిత్రి బయోపిక్ తీసినా, తరువాతైనా మస్తాన్ బాబు బయోపిక్ తియ్యాలని కోరుకుంటున్నాను. మస్తాన్ బాబు బయోపిక్ తీస్తే అది ఆ పర్వతారోహకుడికి సరైన నివాళి అవుతుంది. అది నాగ్ అశ్విన్ మాత్రమే చెయ్యగలడు.

నవతరం నిర్మాతలు, దర్శకుడు అలనాటి మహానటికి నివాళిగా ఈ సినిమా నిర్మించడం అభినందనీయం. సావిత్రి జీవితగాథ సినిమాగా తియ్యాలంటే, ఎంతో ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి. ఇక్కడ నిర్మాత, దర్శకులకి అవి మెండుగా ఉన్నాయి. సరిగ్గా తియ్యకపోతే అభాసుపాలయ్యేవారు. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌ని ఎంచుకోవడంతోనే వాళ్ళకి సగం పని అయిపోయింది. ఇక మిగిలిన పాత్రలు, పాత్రధారులని ఎంచుకుని, ఏ పాత్రతో ఎంతవరకు చేయించుకోవాలో, సినిమాలో ఏ సన్నివేశాలు చూపించాలో నిర్ణయించుకోవడం మిగతా సగం పని. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రేక్షకులని టైమ్ మెషిన్లో కూర్చోబెట్టి, కొన్ని దశాబ్దాలు వెనక్కి తీసుకెళ్ళాడు. ఆనాటి సమాజం, వ్యక్తులు, మాటలు, నగరాలు, భవనాలు, సినిమాలు అన్నీ వీలైనంత సహజంగా రూపొందించారు. అప్పటి స్టూడియోలు చూస్తుంటే, పదేళ్ల క్రితం షారూఖ్, దీపిక నటించిన ఓం శాంతి ఓం సినిమా గుర్తొస్తుంది మనకి.

కీర్తి సురేష్ నటన ఈ సినిమాకి ప్రధాన అకర్షణ. ఆమె అంత బాగా నటించింది. ఈ రోజుల్లో అలాంటి నటి దొరకడం దర్శకుని అదృష్టమనే చెప్పాలి. మనం సినిమాలలో చూడని టీనేజ్ సావిత్రిగా చిలిపితనంతో నటించిన సన్నివేశాలు ఇంకా బాగున్నాయి. అయితే సావిత్రి నటించిన సినిమా సన్నివేశాలు, వాటికి ముందు తెర వెనుక విశేషాలు మరి కొన్ని చూపించి ఉంటే ఇంకా బాగుండేది. మిగతా నటీనటులలో నాకైతే రాజేంద్రప్రసాద్ మాత్రమే నచ్చాడు. దుల్కర్ సల్మాన్ బాగానే చేసినా, ఎందుకో మన ప్రేక్షకులకి కనక్ట్ అవ్వలేదనిపించింది. అతని రూపం కూడ జెమినీ గణేశన్‌కి సూటవ్వలేదు. మిగిలిన పాత్రలన్నీ వచ్చి పోయేవే. సినిమా అయిపోయిన తరువాత గుర్తుండవు. సంగీతం, మాటలు, పాటలు బాగున్నాయి. మొత్తంగా ఫొటోగ్రఫీ బాగున్నా, 1980ల నాటి దృశ్యాలలో మసకగా ఉంది. మా మూవీస్ HD చానల్ చూస్తూ, మధ్యలో ETV సినిమా చానల్ చూసినట్టుంది.

అయితే సినిమా ఎంత బాగున్నా, కొన్ని అనవసర విషయాలు కలపడం బాగోలేదు. సమంత, విజయ్ దేవరకొండ ల పాత్రల అవసరమేమిటో నాకు అర్థం కాలేదు. యువత కోసం ఈ పాత్రలని పెట్టారని కొంతమంది అంటున్నారు. ఇది ఒక సినిమా టెక్నిక్ అయ్యుండవచ్చు కాని, మామూలు ప్రేక్షకులకి నచ్చదు. ఎవరైనా ఈ సినిమాకి సావిత్రిని చూడడానికి మాత్రమే వస్తారు. విజయ్ యాస ఇలాంటి పాత కాలం సినిమాలకి అస్సలు నప్పదు. వీళ్ళ పాత్రలతో ఖర్చయిన సమయాన్ని మరిన్ని సావిత్రి సినిమా షూటింగుల విశేషాలతో ఇంకా బాగా ఉపయోగించుకోవచ్చును. అవి ప్రేక్షకులకి ఆసక్తికరంగా కూడ ఉంటాయి. సమయాభావం వల్ల కొన్ని సీన్లు తీసి కూడ వదిలేసారని విన్నాను. ఇలా అంటున్నందుకు క్షమించండి, మహానటి సినిమా చూద్దామని వస్తే ఈ మహా నత్తి గొడవేమిటో నాకర్థం కాలేదు.

ఈ సినిమా చూడడానికి కొద్ది రోజుల ముందు నేను సావిత్రి జీవితం గురించి పల్లవి గారు వ్రాసిన నవల చదివాను. నవలలోని సన్నివేశాలు చాలా వరకు సినిమాలో చూపించినా ఎందుకనో అందులోని ఒక ముఖ్య పాత్రని వదిలేసారు. ఆ పాత్ర పేరు చాముండి. ఆ పాత్ర నిజమైనదో, కల్పితమో నాకు తెలియదు కాని, సావిత్రి జీవితంలో చాలా ప్రాధాన్యమున్న పాత్ర. జయలలిత జీవితంలో శశికళ లాంటి వ్యక్తి ఆమె. సావిత్రికి తెర వెనుక, నిజ జీవితంలో అన్ని వేళలా సహాయపడిన వ్యక్తి. సావిత్రి మద్రాస్ వచ్చినప్పటినుండి అడుగడుగునా ఆమెకు అక్కలా తోడు ఉంటుంది. అవసరమైనప్పుడు జెమిని గణేశన్‌తో కూడ గొడవపడి సావిత్రికి మద్దతుగా నిలుస్తుంది. అలాంటి పాత్రని సినిమాలో ఉంచి, సమంతకి ఇచ్చి ఉంటే, సమంత ఆ పాత్రకి న్యాయం చేసి మంచి పేరు తెచ్చుకునేది.

నాగేశ్వరరావు, S V రంగారావు లాంటి కొద్దిమందినే సినిమాలో చూపించారు. SVR గా మోహన్‌బాబు బాగానే ఉన్నా, ANR గా నాగ చైతన్య సరిగ్గా కుదరలేదు. బహుశా సుమంత్ ఇంకా బాగుండచ్చు. NTR గా తారక్ కూడ చేసి ఉంటే సినిమా మరింత ఆకర్షణీయంగా ఉండేది. శివాజీ గణేశన్ లేడని తమిళ ప్రేక్షకులు కూడ అసంతృప్తి చెందారు. అందరికంటే ముఖ్యమైన సూర్యకాంతం లేకపోవటం సినిమాలో పెద్ద లోటు. ఇలాంటి సినిమాలు ఎంత బాగా తీసినా, ఇంకా ఏదో కొంత మిగిలిపోతూనే ఉంటుంది కాబట్టి ఉన్నది చూసి ఆనందించెయ్యాలి. అంతే!

1 comment:

  1. ఈ సినిమా రిలిజ్ ఐనపుడు మోహిని థియేటర్ లో చూశా నేను.

    ReplyDelete