Wednesday, 7 January 2015

PK – OMG కన్నా పీకిందేమీ లేదు.


PK పీకిందేమీ లేదని అనడంలో ప్రాస కోసం తక్కువ స్థాయి భాష వాడడం నా ఉద్దేశం కాదు. ఈ రెండు సినిమాలలోనూ, దర్శకులు చేసింది కోడిగుడ్డుకి ఈకలు పీకడమే. కాకపోతే OMGలో కాస్త ఎక్కువ ఈకలు పీకారు. PKలో అంత ఎక్కువ పీకక పోయినా, నిరసనలు మాత్రం విపరీతంగా ఉన్నాయి. నా దృష్టిలో PK సినిమాలో నిషేధించవలసినంత "దృశ్యం" ఏమీ లేదు. భయపడేవాడే మందిరానికి వెళతాడని అన్నప్పుడు, మందిరం అన్న మాటకి అర్థం గుడి అని మాత్రమే కాకుండా ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరమైనా అని తీసుకోవాలని నా అభిప్రాయం. OMG సినిమాలోనే ఇంతకంటే ఎక్కువ విమర్శలు, వెటకారాలు, హేళనలు, వితండవాదనలు ఉన్నాయి. అయితే సినిమా చివరిలో కొన్ని సద్విమర్శలు కూడ ఉన్నాయి. అసలు OMG సినిమా ఇప్పటికే వచ్చిన తరువాత PK సినిమా తీయవలసిన అవసరమే లేదు. చాలా వరకు అదే కాన్సెప్టు, అదే సన్నివేశాలు PKలో కూడ ఉన్నాయి. OMG కాన్సెప్టుకి ఒక గ్రహాంతర వాసిని, ఒక ప్రేమ కథని కలిపారు అంతే. క్లైమాక్స్ కూడ చప్పగా టివి కార్యక్రమంలా ఉంది. PK తో పోలిస్తే, చెప్పదలుచుకున్న విషయాన్ని OMG లోనే సూటిగా సుత్తి లేకుండా చెప్పారు. అలాగే ఈ సినిమాకి PK అని ఇంగ్లీష్ అక్షరాల పేరు పెట్టి ప్రేక్షకులని కన్‌ఫ్యూజ్ చేయడం ఎందుకు? హిందీలో "పీకే" అని పెట్టవచ్చు కదా. ఆమిర్‌ఖాన్, హీరాని, వినోద్ చోప్రాల మీద నాకు గౌరవం ఉంది. వీళ్ళు అందరిలా మాస్ మసాలా సినిమాలు కాకుండా, కొంతైనా వైవిధ్యంగా ఉండే సినిమాలు తీస్తారు. కాని ఈ సినిమాలో అది లేదు. OMG సినిమాని రీమిక్స్ చేసి వదిలారంతే.

 

ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో గ్రహాంతరవాసులు అంటే మనుషుల్లా కాకుండా ప్రత్యేక ఆకారంలో ఉన్నట్టు, వాళ్ళు మనకంటే చాలా అడ్వాన్సుడుగా ఉన్నట్టుగా చూపించారు. వాళ్ళు భూమి మీదకు రాగలిగారంటే, మన కంటే తెలివైన వాళ్ళు, ఎక్కువ టెక్నాలజీ తెలిసిన వాళ్ళు అయి ఉండాలి కదా! అలాగే ఇక్కడకు వచ్చే ముందు ఇక్కడి పరిస్థితులని ముందే అవగాహన చేసుకునే ఉండాలి కదా! కాని ఈ సినిమాలో ఆ గ్రహాంతరవాసి చాలా అయోమయంగా భూమి మీదకు వస్తాడు. ఆ మాత్రానికి గ్రహాంతరవాసి బదులు ఏ ఆదిమానవుడో అడవుల్లోంచో, హిమాలయాల్లోంచో వచ్చినట్టు చూపించవచ్చు.

   

ఈ సినిమాలో ఇంకో మిస్టేక్ ఏమిటంటే, పీకే కి ఎదుటి వ్యక్తుల చేతులు పట్టుకుని, వాళ్ళ మనసులో ఉన్న విషయాలన్నీ చదివే శక్తి ఉంటుంది. మరి అలాంటప్పుడు తాను పోగొట్టుకున్న రిమోట్ కోసం సంజయ్ దత్ అండతో రిమోట్ దోచుకున్న వ్యక్తిని పట్టుకుని, అతని చేతుల ద్వారా రిమోట్ ఎవరికి అమ్మాడో తెలుసుకోవచ్చు కదా! రిమోట్ ఎవరి దగ్గర ఉందో తెలుసుకోవడానికి దిల్లీ మహానగరం అంతా తిరగడం ఎందుకు? నీ రిమోట్ ఎక్కడ ఉందో దేవుడికే తెలియాలి అని దారిన పోయే దానయ్యలు చెప్పిన మాట పట్టుకుని, గుళ్ళూ గోఫురాలు తిరిగి దేవుడిని అన్వేషించడం, దేవుడు కనపడుటలేదని కరపత్రాలు పంచిపెట్టి విమర్శించడం, ఇవన్నీ ఎందుకు?


ఈ రెండు సినిమాలు తీసిన వాళ్ళు గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే, నమ్మకం వేరు, మూఢ నమ్మకం వేరు. ఇక్కడ మతం నమ్మకం. కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు మూఢ నమ్మకాలు. అలాగే దేవాలయం నమ్మకం, ఆశ్రమం మూఢ నమ్మకం. నమ్మకాన్ని గౌరవించాలి. నమ్మకాన్ని విమర్శించడం అనవసరం. విమర్శించినా పద్ధతిగా విమర్శించాలి. హేళన చెయ్యకూడదు. నమ్మకాన్ని ఎవరైనా విమర్శించినా, ప్రజలు పట్టించుకోరు. తమ విశ్వాసాలని వదులుకోరు. మూఢ నమ్మకాలని తీవ్రంగా విమర్శించవచ్చు. దాని వలన కొంతమందైనా హేతుబద్ధంగా ఆలోచించి మూఢ నమ్మకాలు వదులుకుంటారు. అలాగే దేవుడు నమ్మకం, స్వాములు, బాబాలు మూఢ నమ్మకం. నా దృష్టిలో ఈ స్వాములు, బాబాలు దైవసమానులు (GOD MEN) కారు. వీళ్ళు కేవలం దళారులు. వీళ్ళ దగ్గరకు వెళ్ళే వాళ్ళు అమాయకులు, అజ్ఞానులు అయినా అయి ఉండాలి లేకపోతే ఆ వ్యవహారంలో స్వప్రయోజనం ఉన్న స్వార్థపరులు అయినా అయి ఉండాలి. కాని ఈ సినిమాలలో దేవుళ్ళనీ, బాబాలనీ ఒకే గాటన కట్టి ఇష్టమొచ్చినట్టు విమర్శించడం వలన సమాజంలో ఎటువంటి మార్పూ రాదు.


ఇలాంటి సబ్జెక్టుల మీద సినిమాలు తీస్తే సీరియస్‌గా తియ్యాలి కాని కామెడీ కోసం, వినోదం కోసం తియ్యకూడదు. వినోదం కోసం తీస్తే వివాదాస్పద అంశాలు లేకుండా చూసుకోవాలి. వినోదం కోసం తియ్యడం వలన ఆశించిన ప్రయోజనం కూడ నెరవేరదు. ప్రేక్షకులు సినిమా చూసి ఆనందిస్తారు కాని ఆలోచించరు. ఒకసారి 1985లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన దేవాలయం సినిమా గుర్తుకు తెచ్చుకోండి. అందులో హీరో కూడ మొదట నాస్తికుడే. దేవుడు ఉన్నది నిజం అయినా కాకపోయినా, దేవాలయం ఉన్నది నిజం అని అర్థం చేసుకుని, తప్పనిసరి పరిస్థితులలో పూజారిగా బాధ్యతలు నిర్వహిస్తాడు. దేవాలయాన్ని దోచుకుంటున్న దుర్మార్గుల ఆట కట్టిస్తాడు.


ఈ PK సినిమా కథని రాఘవేంద్రరావు లాంటి కమ్మర్షియల్ దర్శకుడు సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? చాలా వినోదాత్మకంగా ఉంటుంది. ఎటువంటి గొడవలు, నిరసనలు ఉండవు. అవును, ఆయన ఇలాంటి కథతోనే ఒక సినిమా తీసాడు. అదే జగదేకవీరుడు - అతిలోకసుందరి. నాకైతే రెండు సినిమా కథలలో పెద్ద తేడా కనిపించలేదు. ఆ తెలుగు సినిమాలో శ్రీదేవి ఇంద్రలోకం నుండి భూమి మీదకు వచ్చి తన ఉంగరం (రిమోట్) పోగొట్టుకుంటుంది. ఆ ఉంగరం కోసం హీరో చిరంజీవి దగ్గరకు చేరుతుంది. ఆంజనేయ భక్తుడైన హీరో తన సంపాదనలో కొంత భాగం దేవుడికిస్తూ, కొంతమంది అనాథలని పోషిస్తూ ఉంటాడు. అక్కడా ఒక దొంగ స్వామి, అమ్రేష్ పురి ఉంటాడు. కాని హీరో దేవుడిని వెతుకుతూ కూర్చోకుండా, శక్తిమంతుడైన దొంగ స్వామిని చివరికి తన మానవశక్తితోనే అంతం చేస్తాడు.


PK సినిమా చివరిలో ఇంకో జోక్ ఏమిటంటే, టేప్ రికార్డర్ వినడానికి PK బోలెడన్ని బ్యాటరీలు భూమి మీద నుంచి పట్టుకెళతాడు. స్పేస్‌షిప్‌లో గ్రహాంతరయానం చెయ్యగలిగినవాళ్ళకి మన బ్యాటరీలు అవసరమా? లేక ప్రకటనల ఆదాయం కోసం అలా చూపించారా? నాకైతే యమగోల సినిమా చివరిలో అల్లు రామలింగయ్య అమాయకంగా పెట్టె నిండా పెన్నులు, సీసాలు మొదలైనవి తీసుకెళ్ళడం గుర్తొచ్చింది.

Friday, 2 January 2015

బాబాయ్ అబ్బాయ్ - అతడు


"అతడు" సినిమాలో బ్రహ్మానందం, హేమ ల కాఫీ కామెడీ సీన్ గుర్తుంది కదా! ఆ సీన్‌ని ఒకసారి మళ్ళీ చూడండి.


   
 

ఇప్పుడు జంధ్యాల దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన "బాబాయ్ అబ్బాయ్" సినిమాలోని ఈ సన్నివేశం (46వ నిముషం నుండి) చూడండి.



   


 1985లో వచ్చిన ఈ పాత జంధ్యాల సినిమా సన్నివేశాన్ని త్రివిక్రం తన "అతడు" సినిమాలో బ్రహ్మానందం కి తగ్గట్టు ఇంప్రొవైజ్ చేసినట్టు ఉంది కదా!


Friday, 5 December 2014

గాంధీజీ చూసిన సినిమా

ఈనాడు నెట్ ఎడిషన్, సినిమా విభాగంలో రావికొండలరావు గారు వ్రాసే "ఆణిముత్యాలు" ("సితార" లో "పాతబంగారం" అనుకుంటా) ప్రతి వారం చదువుతుంటాను. గతవారం అందులో AVM వారి గురించి చెప్తూ, వాళ్ళు 1943లో హిందీలో వచ్చిన "రామ రాజ్య" అనే సినిమాను తమిళంలోకి డబ్ చేసారని వ్రాసారు. అలాగే ఆ హిందీ సినిమా గాంధీజీ చూసిన ఏకైక భారతీయ చిత్రం అని కూడ వ్రాసారు. ఆ "రామ రాజ్య" సినిమా కోసం నెట్‌లో వెదికితే అదే గాంధీజీ చూసిన ఒకే ఒక భారతీయ సినిమా అని చాలా చోట్ల ఉంది. యూట్యూబ్‌లో ఆ సినిమా వీడియో కూడ ఉంది.





యూట్యూబ్‌లో సినిమా ప్రింట్ క్వాలిటీ అంత బాగోలేకపోయినా, మొత్తం సినిమా చూసాను. ఇందులో ప్రేం అదిబ్ శ్రీరాముడిగా, శోభనా సమర్థ్ సీతగా నటించారు. విజయ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ మన తెలుగులో వచ్చిన "లవకుశ" కథే. ఇంతకు ముందు బాపు గారు తీసిన "శ్రీరామరాజ్యం" సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారో అని సందేహం ఉండేది. ఈ హిందీ సినిమా చూసాక, బహుశా "రామరాజ్య"  ప్రేరణతోనే "శ్రీరామరాజ్యం" అని పేరు పెట్టి ఉంటారని అనిపించింది.

అయితే తెలుగు సినిమాలకి, ఈ హిందీ సినిమాకి కథలో కొన్ని మార్పులు ఉన్నాయి. తెలుగు సినిమాలలో సీతని అడవికి పంపడానికి రాముడు, కేవలం దోభీ అభిప్రాయం మీదే ఆధారపడినట్లు ఉంది. కాని హిందీ సినిమాలో అయోధ్యలో ప్రజాభిప్రాయ సేకరణ కూడ జరిపి, ఎవరూ దోభీ మాటలని వ్యతిరేఖించకపోవడం వల్లే సీతని అడవికి పంపించినట్లు తీసారు. అలాగే "శ్రీరామరాజ్యం"లో సీతా సీమంతం అడవిలో మునిపత్నులు చేసినట్టు తీసారు. హిందీ "రామరాజ్య"లో అయోధ్యలోనే సీతా సీమంతం జరిగినట్టు చూపించారు.
  

Tuesday, 25 November 2014

కుంచే చిత్తరువాయెరా… అందాల బాపు, (02-09-2014)


కుంచే చిత్తరువాయెరా…
అందాల బాపు,
కుంచే చిత్తరువాయెరా…
మా బొమ్మల బాపు,
కుంచే చిత్తరువాయెరా…

సుమారు ఎనభయ్యేళ్ళ క్రితం మా నరసాపురంలో సత్తిరాజు లక్ష్మీనారాయణగా భూమ్మీదకొచ్చి, ఇప్పుడు బహుముఖప్రజ్ఞాశాలి బాపుగా తెలుగువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశా మన బాపుని సృష్టించేటపుడు ఆ బ్రహ్మ గారు పొరపాటున తన చేతులనే బాపుకి అతికించేసి క్రిందికి పంపించేసుంటారు. లేకపోతే అంత అందమైన బొమ్మలని జీవం ఉట్టిపడేలా సృష్టించడం మానవమాత్రుల చేతులకు సాధ్యమా? తెలుగు బాలుడంటే బుడుగులా, తెలుగు బాలికంటే సీగానపెసూనాంబలా, తెలుగమ్మాయంటే బాపు బొమ్మలా ఉండాలని గీత గీసి చెప్పడం ఒక్క బాపు మాత్రమే చెయ్యగలరు. బాపు సృష్టించిన లిపిలో తెలుగు అక్షరాలు వర్షంలో తడిసిన చిన్నపిల్లల్లా కిల కిలా నవ్వుతూ ఆడుకున్నాయి. ఇన్ని అందాలు సృష్టించిన ఆ బాపు గారి కుంచె ఇప్పుడు నడక మర్చిపోయి, జీవం కోల్పోయి చిత్తరువులా మిగిలింది.

కుంచెని, కెమేరాని అందంగా, కరష్టుగా మిక్స్ చేసి ఆయన తీసిన సినిమాలు వెండితెరపై ఆయన పెట్టిన ముత్యాలముగ్గులే మరి! బుడుగులో బాలకృష్ణుడిని, బాలకృష్ణుడిలో బుడుగుని ఆవిష్కరింపచెయ్యడం ఆయన తీసిన భాగవతంలో మాత్రమే చూడగలం. శృంగారాన్ని సుశ్లీలంగా చూపించి ప్రేక్షకుల మనసులని రంజింపచెయ్యడం బాపుకు తెలిసినట్టుగా ఏ సినీదర్శకుడికీ తెలియదు. కొత్తగా పెళ్ళయినవాళ్ళందరూ ఆయన సినిమాలని ముఖ్యంగా ముత్యాలముగ్గు, పెళ్ళిపుస్తకం లాంటివి చూసితీరాలి. తెలుగు సినిమాలలో పంచ్ డైలాగులు మొదలయ్యింది కూడ బహుశా ముత్యాలముగ్గుతోనే అని నా అభిప్రాయం. అందులో రమణ గారు వ్రాసిన రావు గోపాల రావు డైలాగులని ఆ రోజుల్లో కేసెట్లు చేసి అమ్మేవారు.

ఒక మనిషి తన జీవితకాలంలో తన గుర్తుగా ఇన్ని అందాలు, అనుభూతులు, జ్ఞాపకాలు భూమి మీద వదిలిపెట్టినప్పుడు ఆ మనిషి మరణించాడని ఎలా అనగలం? మామూలు మనుషులు అన్నివిధాలుగా మరణిస్తారు, కాని మహనీయులు భౌతికంగా మాత్రమే మరణిస్తారు. శ్రీ బాపు గారి బొమ్మలు, సినిమాలు మొదలయిన జ్ఞాపకాలతో ఒక చక్కటి బొమ్మల కొలువు (ఎప్పుడూ మ్యూజియం అనే అనాలా?) ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

baapu

 

కుంచే చిత్తరువాయెరా…