Saturday 1 August 2015

బాహుబలి - The Grand Plate Meals

Baahubali

ఫైవ్ స్టార్ హోటల్‌కి బఫే కోసం అని వెళితే ప్లేట్ మీల్స్ పెట్టి పంపిస్తే ఎలా ఉంటుంది? పంచ భక్ష్య పరమాన్నాలతో కూడిన బ్రహ్మాండమైన విందు భోజనం అని పిలిచి ప్లేట్ చిన్నదిగా ఉంది, కొన్ని ఐటెంస్ మాత్రమే ఇవ్వాళ తినండి, మిగిలిన వాటికి రేపు మళ్ళీ రండి అని రూల్ పెడితే ఎలా ఉంటుంది? బాహుబలి సినిమా మొదటి భాగం అలాగే ఉంది. కథని అర్థంతరంగా ఆపేసి రెండో భాగం వచ్చే ఏడాది చూడండి అంటే, టివిలో సిన్సియర్‌గా డైలీ సీరియళ్ళు చూసేవాళ్ళకి బానే ఉంటుందేమో కాని, సగటు సినిమా ప్రేక్షకుడికి కడుపు నిండదు.

సినిమాని రెండు భాగాలుగా చెయ్యడంవల్ల ప్రేక్షకుడు అసంతృప్తిగా హాలు నుండి బయటికొస్తాడు. విలన్‌పై హీరో విజయం సాధించి శుభం కార్డు పడితేనే సినిమా పూర్తయినట్టు భావించడం మనకి అలవాటు. మూడు గంటల సమయం తీసుకున్నా, కొన్ని సన్నివేశాల నిడివి తగ్గించి, మొత్తం కథని ఒకే సినిమాగా చూపించి ఉంటే బాగుండేది. లేకపోతే కొంత కథని వర్తమానంలోనూ, కొంత ఫ్లాష్ బాక్ కథని చూపించే బదులు, మొదటి భాగంలో అమరేంద్ర బాహుబలి కథని మొత్తం చూపించి, రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే సన్నివేశం దగ్గర మొదటి భాగం ముగిస్తే బాగుండేది. రెండో భాగంలో శివుడి కథని మొదలుపెట్టి పగ తీర్చుకోవడంతో పూర్తిచేస్తే ఏ భాగానికా భాగం ఇండిపెండెంట్‌గా, ఇంచుమించు సమగ్రంగా ఉండేది. వీలైతే మరిన్ని సీక్వెల్స్ కూడ తీసుకోవచ్చు.

సినిమాలో చాలా దృశ్యాలు, సన్నివేశాలు అద్భుతంగా ఉండి కనువిందు చేసాయి. రమ్యకృష్ణ బాలుడిని నది దాటించే ప్రయత్నం, జలపాతాలు, ప్రభాస్ శివలింగాన్ని భుజానికెత్తుకోవడం, ప్రభాస్ తమన్నాల యుగళగీతం, మాహిష్మతి రాజ్య నగర దృశ్యాలు, రానా విగ్రహాన్ని నిలబెట్టే సన్నివేశం, యుద్ధ సన్నాహాలు, కాలకేయుడితో యుద్ధ సన్నివేశాలు, ఇలా చాలా సీన్లు రిచ్‌గా, గ్రాండ్‌గా తీసారు. పోరాట దృశ్యాలు చాలానే ఉన్నాయి. కొన్ని బాగున్నాయి కాని, మరి కొన్నింటి నిడివి మరీ ఎక్కువై కథ నెమ్మదిగా జరగడానికి కారణమయ్యాయి.

సన్నివేశాలు వేటికవి విడిగా చూస్తే గొప్పగా ఉన్నాయి కాని, వాటినన్నింటినీ సరిగ్గా కలపవలసిన కథ బలంగా లేదు. సీన్లు రిచ్‌గా తియ్యడంలో పెట్టిన శ్రద్ధ స్క్రిప్టుపై పెట్టలేదనిపిస్తుంది. కథ మామూలు చందమామ కథే. అది కూడ గతంలో మగధీర సినిమాలో చూసిన కథే. అక్కడ అరగంటలో చెప్పిన కథని ఇక్కడ అయిదు గంటలకు విస్తరించారు. కాని మగధీరలో ఉన్నంత ఆసక్తికరంగా బాహుబలిలో చూపించలేకపోయారు. కాకపోతే ఇటువంటి పాత్రని రాం చరణ్ కంటే బాగా చెయ్యగలనని ప్రభాస్ నిరూపించాడు.

నటీనటుల విషయానికి వస్తే ప్రభాస్, రాణా, రమ్యకృష్ణ, సత్యరాజ్, ఇలా ఇంచుమించు పాత్రధారులంతా చాలా బాగా చేసారు. కాని సినిమాలో పాటలు గొప్పగా లేవు. పచ్చబొట్టు పాటైతే డబ్బింగ్ సినిమా పాటలా ఉంది. రాజమౌళి బియాండ్ కీరవాణి ఆలోచిస్తే బాగుంటుంది. మాటలు చాలా తక్కువగా ఉన్నాయి కాని, కొన్ని బాగున్నాయి.

నాకు ఇంగ్లీష్ సినిమాలు చూసే అలవాటు పెద్దగా లేదు కాబట్టి నాకు తెలియదు కాని, చాలా సన్నివేశాలు వివిధ ఇంగ్లీష్ సినిమాలనుండి కాపి కొట్టారని అంటున్నారు. అదే నిజమయినా మనం చిన్నపుడు చదువుకున్న చందమామ కథల లాంటి ఒక భారతీయ కథని మన భాషలో ఇంత ఘనంగా చూపించినందుకు రాజమౌళిని, నిర్మాతలని అభినందించాలి. ఎప్పుడూ చూసే రొటీన్ పగ సాధింపు సినిమాల కంటే ఈ సినిమా చాలా బెటర్. చివరలో చిన్న సందేహం. కాలకేయుడి భాష వేరేదైనప్పుడు అతని పేరు కూడ ఆ భాషలోనే ఉండాలి కదా!


 

4 comments:

  1. Q. కాలకేయుడి భాష వేరేదైనప్పుడు అతని పేరు కూడ ఆ భాషలోనే ఉండాలి కదా!

    A. అవసరం లేదండీ.కాని మంచిప్రశ్న వేసారు. ఇక సమాధానం చూదాం. మన తెలుగువాళ్ళలోనే మనం పెట్టుకొనే పేర్లన్నీ దాదాపుగా సంస్కృతపదాలతో కూడి ఉంటున్నాయి. ఏదో ఎల్లయ్య, పుల్లమ్మ లాంటివి మినహాయిస్తే. రామకృష్ణప్రసాద్ అంటే అందులో తెలుగుమాటేమన్నా ఉందా - కాని తెలుగు వాళ్ళూ ఆపేరుతో ఉంటారుగా బోల్డుమంది. మనం నిత్యం చూసే 'రావు' ఉపపదం (నా పేరు శ్యామలరావు) మారాఠీ పదం అనుకుంటాను. మహమ్మదీయులు స్థానికభాషల్లో సంభాషిస్తారు - తరచు అవే వారికీ మాతృభాషలు, కాని పేర్లు మాత్రం స్థానికుల పేర్లకన్నా భిన్నంగా వేరే ఒకే విధంగా ఉంటాయి ప్రాంతాలకతీతంగా అరబిక్ / పెర్షియన్ నామాలతో, ఈ మాట క్రైస్తవుల్లో కూడా తరచూ వర్తిస్తుంది. అందుచేత సినిమాపరంగా అలోచిస్తే స్థానికంగా ఆ కాలకేయులది వేరే భాష ఐనా వాళ్ళ పేర్లు సమకాలీనంగా మిగతాప్రాంతాలవారిలాగే సంస్కృతపదాలు కావటం పెద్ద ఇబ్బంది అనుకోనవసరం లేదు.

    ReplyDelete
  2. "కాలకేయులు" అన్నది మహిష్మతి ప్రజలు ఆ జాతి వారిని ఉద్దేశించి పిలిచిన పదం. వారు వారి భాషలో ఏమనుకున్నారన్నది మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మనవారు ప్రాచీన కాలంలో అరబ్బులను "యవనులు" అనే వారు. అందులో ఒకన్ని "కాలయవనుడు" అంటూ భాగవతంలో చెప్పారు. అంతమాత్రాన అరబ్బులు కూడా అలాగే పిలుచుకోవాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
  3. "కాలకేయులు" అన్నది మహిష్మతి ప్రజలు ఆ జాతి వారిని ఉద్దేశించి పిలిచిన పదం. వారు వారి భాషలో ఏమనుకున్నారన్నది మనకు తెలియాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు మనవారు ప్రాచీన కాలంలో అరబ్బులను "యవనులు" అనే వారు. అందులో ఒకన్ని "కాలయవనుడు" అంటూ భాగవతంలో చెప్పారు. అంతమాత్రాన అరబ్బులు కూడా అలాగే పిలుచుకోవాల్సిన అవసరం లేదు.

    ReplyDelete
  4. ఈ సినిమా రిలిజ్ ఐనపుడు పంజాగుట్ట పీవియార్ థియేటర్ లో చూశా నేను.

    ReplyDelete