Wednesday 14 June 2017

భళి భళి రా.. రాజమౌళి.

బాహుబలి ది కంక్లూజన్. ఈ మధ్య కాలంలో ఒక సినిమాని రెండోసారి థియేటర్‌కి వెళ్ళి చూసిన సందర్భం ఇదే. 21వ శతాబ్దం ప్రారంభం నుండి టివిలో సినిమాలు ఎక్కువగా రావడం మొదలయ్యాకా చాలామంది థియేటర్లకి వెళ్ళడం తగ్గించేసారు. ఎప్పుడైనా మంచి సినిమాలు వచ్చినపుడు ఒకసారి థియేటర్‌కి వెళ్ళి చూసినా, రెండోసారి వెళ్ళడం అరుదే. బాహుబలి 2 సినిమాని నేను మొదట ఐమాక్స్ తెరపై చూసాను. అద్భుతంగా అనిపించింది. మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించి ప్రయత్నిస్తే ఇప్పటికి కుదిరింది. కాని మామూలు తెరపై చూడాల్సివచ్చింది. అయినా అద్భుతంగానే అనిపించింది.

నిజానికి ఇదేమీ గొప్ప కధేమీ కాదు. చిన్నప్పుడు చందమామలో చదువుకున్న అనేకానేక జానపదకథల్లాంటిదే. రామారావు, కాంతారావు, రాజనాల నటించిన ఎన్నో పాత సినిమాలు ఇలాగే ఉంటాయి. కాని ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కించిన విధానమే ఈ సినిమాని గొప్ప స్థాయికి తీసుకువెళ్ళింది. అందుకే ఈ సినిమా కథ గురించి కాకుండా సినిమాలోని పాత్రల గురించి వ్రాస్తే బాగుంటుందనిపించింది. సినిమాలోని పాత్రలన్నీ కూడ రామాయణం, భారతం లోని పాత్రలని గుర్తుచేస్తూ ఉంటాయి. ముఖ్యమైన పాత్రలన్నింటిని చాలా శ్రద్ధగా తీర్చిదిద్దారనిపిస్తుంది. అలాగే పాత్రలకి న్యాయం చేసే సరి అయిన నటీనటులని ఎన్నుకుని ఆ పాత్రలకి సహజత్వం తీసుకొచ్చాడు రాజమౌళి.

శివగామి: ఈ సినిమాలో అన్నింటి కన్నా ముఖ్యమైన పాత్ర ఇది. గాంధారి + కుంతి + కైకేయి = శివగామి. అయితే కుంతి పాత్రని చంపేసి ఆ పాత్రని కూడ శివగామి పాత్రలో కలిపేసారు. తోడికోడలి కొడుకు బాహుబలిని తన కన్నబిడ్డతో సమానంగా పెంచిపెద్ద చేస్తుంది శివగామి. తన కొడుకుకు రాజు అయ్యే అర్హత లేదని తెలిసి, బాహుబలిని రాజుని చేస్తుంది. కాని కైకేయిలా చెప్పుడుమాటలు విని బాహుబలిని బయటికి పంపించి తన కొడుకుని రాజుని చేస్తుంది. చివరికి తన తప్పు తెలుసుకుని బాహుబలి కొడుకుని రక్షిస్తుంది. అక్కడక్కడ ఇందిరాగాంధిని కూడ గుర్తు చేస్తుంది ఈ శివగామి పాత్ర. ఈ పాత్రకి రమ్యకృష్ణ తప్ప మరెవ్వరూ న్యాయం చెయ్యలేనంత అద్భుతంగా నటించింది.

కట్టప్ప: శివగామి తరువాత అంత ముఖ్యమైన పాత్ర కట్టప్పది. భీష్ముడు + కర్ణుడు = కట్టప్ప. మూడు తరాలని చూసిన వృద్ధ వీరుడు కట్టప్ప. వంశాచారం ప్రకారం రాజరికానికి బందీగా పనిచేస్తూ మంచితనానికి మద్దతు ఇవ్వలేక కుమిలిపోయే భీష్ముడి లాంటి పాత్ర. అలాగే తను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి దుష్టుడైన భల్లాలదేవుని కాపాడడానికి తన ప్రాణాన్ని కూడ పణంగా పెట్టే కర్ణుడు లాంటివాడు. ఈ పాత్రకి సత్యరాజ్ పూర్తిగా న్యాయం చేసాడు. కాని ఈ పాత్రకి న్యాయం చేసే కేరక్టర్ ఆర్టిష్ట్ తెలుగులో దొరకకపోవడం దురదృష్టం. రంగనాథ్, శరత్‌బాబు తరువాత తెలుగులో మంచి సహాయనటులే కరువయ్యారు.

బాహుబలి: తండ్రీకొడుకులైన ఇద్దరు బాహుబలులని, ఇంచుమించు ఒకే విధంగా మలచారు. రాముడు + అర్జునుడు + భీముడు = బాహుబలి. తండ్రి మాట జవదాటని రాముడిలా శివగామి అజ్ఞని పాటిస్తూ వనవాసం వెళ్ళినట్లు రాజప్రాసాదాన్ని విడిచి జనావాసాలకి వెళతాడు బాహుబలి. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు కూడ ఇలాగే వనవాసం చేస్తారు. అర్జునుడు లాంటి వీరుడు, భీముడంతటి బలశాలి. అలాగే రాజు స్థానంలో ఎవరున్నా, ప్రజల మద్దతు మాత్రం ఎప్పుడూ బాహుబలికే ఉంటుంది. ప్రభాస్ తప్ప ఈ పాత్రకి ఇంకెవరినీ ఊహించలేము. రాజమౌళిని నమ్మి అన్నేళ్ళు ఈ చిత్రానికే కష్టపడి పని చేసినందుకు ప్రభాస్‌కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.

దేవసేన: సీత + ద్రౌపది = దేవసేన. సీతలా బాహుబలితో రాజప్రాసాదాన్ని విడిచి జనావాసానికి వెళుతుంది. అక్కడే లవకుశులకి జన్మనిచ్చినట్టు మహేంద్ర బాహుబలికి జన్మనిస్తుంది. తరువాత రావణుడు లాంటి భల్లాలదేవుడికి బందీగా మారి అశోకవనంలో సీతలా కొడుకు కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అంతకుముందు ద్రౌపదిలా నిండుసభలో అవమానానికి గురవుతుంది. అనుష్క కూడ చాలా చక్కగా నటించి తన పాత్రకి న్యాయం చేసింది. ప్రభాస్‌కి సరైన జోడిగా కుదిరింది.

భల్లాలదేవుడు: రావణుడు + దుర్యోధనుడు = భల్లాలదేవుడు. దుర్యోధనుడిలా రాజ్యాధికారం కోసం ఎప్పుడు రగిలిపోతూ ఉంటాడు. సోదరుడు లాంటి బాహుబలితో కలిసి నడుస్తూనే కుట్రలు పన్నుతూ ఉంటాడు. భరతుడు దుర్యోధనుడిలాంటి వ్యక్తి అయితే ఎలా ఉంటాడో, అలా ఉంటాడు. తండ్రితో కలిసి తల్లిని కైకేయిలా మారుస్తాడు. అమరేంద్ర బాహుబలిని చంపించినా, కసి తీరక దేవసేనని రావణుడు బంధించినట్టు బంధిస్తాడు. దగ్గుబాటి రానా ప్రభాస్‌తో పోటీపడి తన పాత్రని బాహుబలికి దీటుగా నిలబెట్టాడు. క్లైమాక్స్‌లో మహేంద్ర బాహుబలి కన్నా వీరోచితంగా పోరాడతాడు.

బిజ్జలదేవుడు: ధృతరాష్ట్రుడు + శకుని = బిజ్జలదేవుడు. ధృతరాష్ట్రుడిలాగే తనకు దక్కనట్టు, తన కొడుకుకి కూడా సింహాసనం దక్కదేమోనని కుట్రలు పన్నుతూ ఉంటాడు. అవకాశం దొరికినప్పుడల్లా తన కుమారుడిని గొప్పగా చూపిస్తుంటాడు. శకునిలా కొడుకుతో దురాలోచనలు చేస్తుంటాడు. మంధరలా కైకేయి మనసు విరిచెయ్యాలని ప్రయత్నిస్తుంటాడు.

కుమారవర్మ: ఇది నర్తనశాలలో ఉత్తరకుమారుడు లాంటి పాత్ర. విరాటపర్వంలో అర్జునుడు గోగ్రహణం కోసం యుద్ధం చేస్తే ఇక్కడ సిల్లీగా పందులవేట చేస్తాడు బాహుబలి. అసలు ఈ కుమారవర్మ పాత్ర సినిమాకి అవసరం లేదు. అలాగే అవంతిక పాత్ర కూడ. ఈ రెండు పాత్రలు సినిమా నిడివి పెంచి రెండు భాగాలుగా చెయ్యడానికి, కాస్త వినోదం పంచడానికి తప్ప ఇంకెందుకూ పనికిరావు. కుమారవర్మగా సుబ్బరాజు తన వంతుగా బాగానే ప్రయత్నించినా, గొప్పగా చెయ్యలేకపోయాడు. కుమారవర్మ పాత్రకి సునీల్(వర్మ) అయితే బాగుండేది. కామెడీ ఇంకా సహజంగా ఉండేది. కమేడియన్ నుండి హీరోకి ఎదిగిన సునీల్ లాగానే కుమారవర్మ పాత్ర కూడ ఉంటుంది కాబట్టి సునీల్ అయితే బాగుండేది.

ఒక మామూలు జానపదకథలో ఇన్ని బలమైన పాత్రలు, వాటి మధ్య బలమైన ఎమోషన్స్ సృష్టించిన రచయిత విజయేంద్ర ప్రసాద్ అభినందనీయులు. అలాగే ఆ పాత్రలకు సరిపోయే నటీనటులని ఎన్నుకుని, వాళ్ళచేత అద్భుతంగా నటింపచేసిన దర్శకుడు రాజమౌళి ఇంకా అభినందనీయుడు. ముఖ్యంగా ఒక్కొక్క సన్నివేశాన్ని, శ్రద్ధగా సాంకేతిక అద్భుతంగా తీర్చిదిద్దినందుకు రాజమౌళి టీంని ప్రశంసించాలి. అందుకే ఈ సినిమాకి ప్రపంచమంతా గొప్ప పేరు ప్రఖ్యాతులు వచ్చాయి.
అయినా ఒక అసంతృప్తి ఏమిటంటే, ఇంత కష్టపడి, ఇంత ఖర్చు పెట్టి, ఒక కాల్పనిక కథని సినిమాగా తీసే బదులు ఒక పౌరాణిక లేదా చారిత్రక గాథని సినిమాగా తీసి ఉంటే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయేదీ. రాజమౌళి భవిష్యత్తులో ప్రభాస్‌తోనే "అల్లూరి సీతారామరాజు" కథని యధాతథంగా, ఎటువంటి గ్రాఫిక్సు లేకుండా సినిమాగా తీసి మన తెలుగు వీరుడి చరిత్రని యావద్దేశానికి సగౌరవంగా గుర్తు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

2 comments:

  1. పాత్రధారుడికి జనంలో ఉన్న గుర్తింపు పాత్రను కమ్మెయ్యకుండా ఉండాలని కాబోలు సునీల్‌కు బదులుగా సుబ్బరాజును తీసుకున్నారు.
    రమ్యకృష్ణగారు అద్భుతంగా నటించినట్లు నాకు అనిపించలేదు. ముఖ్యంగా ఆవిడ హావభావాలు బాగానే ఉన్నా వాచికం అంత బాగా అనిపించలేదు. ప్రభాస్ వాచికం కూడా తరచుగా తేలిపోయింది ఆయన అందచందాల మాట బాగానే ఉన్నా.తెలుగులో సహాయనటులు కరవయ్యారా? ఏమో. ప్రయత్నిస్తే మంచి నటులే దొరకరా? పరభాషానటులపై వ్యామోహం కారణంగా తెలుగులో మంచినటులు అనేకులు అవకాశాలు రాక మరుగునపడి ఉండవచ్చును.
    గ్రాఫిక్స్ అన్నవి అవసరమే - అవి సరిగా వాడితే (ఈ‌సినిమాలో లాగా) సినిమాని బాగా కళగట్టిస్తాయి. లేకుంటే హాస్యాస్పదం ఐపోవచ్చును కూడా!
    పురాణపాత్రలతో బాగా పోల్చారు. అభినందనలు.

    ReplyDelete
  2. ఈ సినిమా రిలిజ్ ఐనపుడు అన్నపూర్ణ థియేటర్ లో చూశా నేను.

    ReplyDelete