Friday 5 December 2014

గాంధీజీ చూసిన సినిమా

ఈనాడు నెట్ ఎడిషన్, సినిమా విభాగంలో రావికొండలరావు గారు వ్రాసే "ఆణిముత్యాలు" ("సితార" లో "పాతబంగారం" అనుకుంటా) ప్రతి వారం చదువుతుంటాను. గతవారం అందులో AVM వారి గురించి చెప్తూ, వాళ్ళు 1943లో హిందీలో వచ్చిన "రామ రాజ్య" అనే సినిమాను తమిళంలోకి డబ్ చేసారని వ్రాసారు. అలాగే ఆ హిందీ సినిమా గాంధీజీ చూసిన ఏకైక భారతీయ చిత్రం అని కూడ వ్రాసారు. ఆ "రామ రాజ్య" సినిమా కోసం నెట్‌లో వెదికితే అదే గాంధీజీ చూసిన ఒకే ఒక భారతీయ సినిమా అని చాలా చోట్ల ఉంది. యూట్యూబ్‌లో ఆ సినిమా వీడియో కూడ ఉంది.





యూట్యూబ్‌లో సినిమా ప్రింట్ క్వాలిటీ అంత బాగోలేకపోయినా, మొత్తం సినిమా చూసాను. ఇందులో ప్రేం అదిబ్ శ్రీరాముడిగా, శోభనా సమర్థ్ సీతగా నటించారు. విజయ్ భట్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కథ మన తెలుగులో వచ్చిన "లవకుశ" కథే. ఇంతకు ముందు బాపు గారు తీసిన "శ్రీరామరాజ్యం" సినిమాకి ఆ పేరు ఎందుకు పెట్టారో అని సందేహం ఉండేది. ఈ హిందీ సినిమా చూసాక, బహుశా "రామరాజ్య"  ప్రేరణతోనే "శ్రీరామరాజ్యం" అని పేరు పెట్టి ఉంటారని అనిపించింది.

అయితే తెలుగు సినిమాలకి, ఈ హిందీ సినిమాకి కథలో కొన్ని మార్పులు ఉన్నాయి. తెలుగు సినిమాలలో సీతని అడవికి పంపడానికి రాముడు, కేవలం దోభీ అభిప్రాయం మీదే ఆధారపడినట్లు ఉంది. కాని హిందీ సినిమాలో అయోధ్యలో ప్రజాభిప్రాయ సేకరణ కూడ జరిపి, ఎవరూ దోభీ మాటలని వ్యతిరేఖించకపోవడం వల్లే సీతని అడవికి పంపించినట్లు తీసారు. అలాగే "శ్రీరామరాజ్యం"లో సీతా సీమంతం అడవిలో మునిపత్నులు చేసినట్టు తీసారు. హిందీ "రామరాజ్య"లో అయోధ్యలోనే సీతా సీమంతం జరిగినట్టు చూపించారు.
  

Tuesday 25 November 2014

కుంచే చిత్తరువాయెరా… అందాల బాపు, (02-09-2014)


కుంచే చిత్తరువాయెరా…
అందాల బాపు,
కుంచే చిత్తరువాయెరా…
మా బొమ్మల బాపు,
కుంచే చిత్తరువాయెరా…

సుమారు ఎనభయ్యేళ్ళ క్రితం మా నరసాపురంలో సత్తిరాజు లక్ష్మీనారాయణగా భూమ్మీదకొచ్చి, ఇప్పుడు బహుముఖప్రజ్ఞాశాలి బాపుగా తెలుగువారిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. బహుశా మన బాపుని సృష్టించేటపుడు ఆ బ్రహ్మ గారు పొరపాటున తన చేతులనే బాపుకి అతికించేసి క్రిందికి పంపించేసుంటారు. లేకపోతే అంత అందమైన బొమ్మలని జీవం ఉట్టిపడేలా సృష్టించడం మానవమాత్రుల చేతులకు సాధ్యమా? తెలుగు బాలుడంటే బుడుగులా, తెలుగు బాలికంటే సీగానపెసూనాంబలా, తెలుగమ్మాయంటే బాపు బొమ్మలా ఉండాలని గీత గీసి చెప్పడం ఒక్క బాపు మాత్రమే చెయ్యగలరు. బాపు సృష్టించిన లిపిలో తెలుగు అక్షరాలు వర్షంలో తడిసిన చిన్నపిల్లల్లా కిల కిలా నవ్వుతూ ఆడుకున్నాయి. ఇన్ని అందాలు సృష్టించిన ఆ బాపు గారి కుంచె ఇప్పుడు నడక మర్చిపోయి, జీవం కోల్పోయి చిత్తరువులా మిగిలింది.

కుంచెని, కెమేరాని అందంగా, కరష్టుగా మిక్స్ చేసి ఆయన తీసిన సినిమాలు వెండితెరపై ఆయన పెట్టిన ముత్యాలముగ్గులే మరి! బుడుగులో బాలకృష్ణుడిని, బాలకృష్ణుడిలో బుడుగుని ఆవిష్కరింపచెయ్యడం ఆయన తీసిన భాగవతంలో మాత్రమే చూడగలం. శృంగారాన్ని సుశ్లీలంగా చూపించి ప్రేక్షకుల మనసులని రంజింపచెయ్యడం బాపుకు తెలిసినట్టుగా ఏ సినీదర్శకుడికీ తెలియదు. కొత్తగా పెళ్ళయినవాళ్ళందరూ ఆయన సినిమాలని ముఖ్యంగా ముత్యాలముగ్గు, పెళ్ళిపుస్తకం లాంటివి చూసితీరాలి. తెలుగు సినిమాలలో పంచ్ డైలాగులు మొదలయ్యింది కూడ బహుశా ముత్యాలముగ్గుతోనే అని నా అభిప్రాయం. అందులో రమణ గారు వ్రాసిన రావు గోపాల రావు డైలాగులని ఆ రోజుల్లో కేసెట్లు చేసి అమ్మేవారు.

ఒక మనిషి తన జీవితకాలంలో తన గుర్తుగా ఇన్ని అందాలు, అనుభూతులు, జ్ఞాపకాలు భూమి మీద వదిలిపెట్టినప్పుడు ఆ మనిషి మరణించాడని ఎలా అనగలం? మామూలు మనుషులు అన్నివిధాలుగా మరణిస్తారు, కాని మహనీయులు భౌతికంగా మాత్రమే మరణిస్తారు. శ్రీ బాపు గారి బొమ్మలు, సినిమాలు మొదలయిన జ్ఞాపకాలతో ఒక చక్కటి బొమ్మల కొలువు (ఎప్పుడూ మ్యూజియం అనే అనాలా?) ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.

baapu

 

కుంచే చిత్తరువాయెరా…


“1” కాదు “ఆర్య – 3″ (20-01-2014)


“1 నేనొక్కడినే” సినిమాని అందరూ చూసి వాళ్ళ అభిప్రాయం చెప్తుంటే, నేనొక్కడినే ఎందుకు చూడకూడదని, “ఎవడు” లాంటి రొటీన్ సినిమా చూసే ఓపిక లేక, ధైర్యం చేసి నిన్న ఈ సినిమా చూసాను. మొదటి సగం బాగా విసుగేసింది. రెండో సగం పరవాలేదు. నాకైతే ఈ సినిమా అల్లు అర్జున్‌తో తీసి ఉంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఒకో హీరోకి ఒకో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ కథతో సినిమా చేస్తేనే జనం సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు. “గీతాంజలి” సినిమా చిరంజీవి చేస్తే చండాలంగా ఉంటుంది. అలాగే చిరంజీవి స్టార్ కాకముందు చేసిన “శుభలేఖ” లాంటి సినిమాలు హిట్టయ్యాయి. స్టార్ అయ్యక ఇష్టపడి చేసిన “రుద్రవీణ”, “ఆరాధన”, “స్వయంకృషి”, ఆపద్బాంధవుడు” లాంటి మంచి సినిమాలు హిట్టవ్వలేదు.

ఏ హీరోకి ఎలాంటి కథ సూటవుతుందో రాజమౌళి సినిమాలు చూసి కొత్త దర్శకులు తెలుసుకోవచ్చు. రామ్ చరణ్ కి “మగధీర” కంటే సరిపోయే కథ ప్రస్తుతం ఉండదు. సునీల్‌కి “మర్యాదరామన్న” అంతే. “ఆరెంజ్” సినిమా రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్‌కే బాగుంటుంది. “బద్రీనాథ్” సినిమా అల్లు అర్జున్ కంటే ప్రభాస్‌కో, రామ్ చరణ్ కో బాగుంటుంది.

ఈ సినిమా మామూలు రొటీన్ తెలుగు సినిమా కాదు, డిఫరెంట్ సినిమా అని చెపుతున్నారు. డిఫరెంట్ అంటే తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, పాజిటివ్‌గా ఉంటే విభిన్నంగా (వైవిధ్యంగా) ఉంది అంటారు. రెండు, నెగటివ్‌గా ఉంటే తేడాగా ఉంది అంటారు. “అపరిచితుడు”, “గజిని” సినిమాలలో ఒక పాజిటివ్ పాయింట్ ఉండి, ఎక్కడా బోర్ కొట్టలేదు కాబట్టే ప్రేక్షకులకి నచ్చాయి. విభిన్నంగా ఉండే కథని ఏ హీరోతో అయినా చెయ్యవచ్చు. తేడాగా ఉండే కథకి అందరు హీరోలు సూటవ్వరు. ఇప్పటికే సుకుమార్ “ఆర్య” సినిమాని అల్లు అర్జున్‌తో రెండు సార్లు చేసి ప్రేక్షకులని ఒప్పించాడు కాబట్టి, ఈ సినిమాని కూడ అల్లు అర్జున్‌తో “ఆర్య – 3″ అని కంటిన్యూ చేసి ఉంటే ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకునేవారు. 

మహేష్‌బాబు తన సినిమాలని ఒప్పుకోవడంలో జాగ్రత్త పడితే మంచిది. “బిజినెస్‌మేన్” లాంటి నెగిటివ్ సినిమా అతనికి సరిపడదు. “SVSC” మంచి సినిమాయే కాని, దర్శకుడు అనుభవం లేక సమగ్రంగా తియ్యలేకపోయాడు. అయినా మహేష్‌బాబు తన పాపులారిటీతో, నటనతో, అందంతో ఆ రెండు సినిమాలు హిట్ చేసాడు. ఎప్పుడూ క్యూట్‌గా ఉండే మహేష్ ఈ సినిమాలో స్లిమ్‌గా కూడ ఉన్నాడు. ఈ సినిమాలో కూడ మహేష్ చాలా బాగా చేసాడు. కాని ప్రేక్షకులు మహేష్ నుండి “దూకుడు” లాంటి నవరసాల వినోదాన్నే కోరుకుంటారు. ఏ సినిమా అయినా, సూపర్ డూపర్ హిట్టవ్వాలంటే, అభిమానులు మాత్రం చూస్తే సరిపోదు. అలాగే ఒకసారి చూసేలా ఉంటే కూడ సరిపోదు.

త్రివిక్రం మాటల్లో చెప్పాలంటే, కాంప్లాన్ బాయ్ లాంటి మహేష్‌బాబుని ఈ సినిమాలో సుకుమార్ కాంప్లికేటడ్ బాయ్ లా చూపించాడు. అసలు మనం సినిమా చూస్తున్నామా, లేక సినిమా చూస్తున్నట్టు ఊహించుకుంటున్నామా అని అనుమానం వస్తుంది. అన్ని ట్విస్టులతో సినిమాని నడిపించడం అవసరమా? కొంచెం సింప్లిఫై చేస్తే బాగుంటుంది కదా! అబ్బే! కాదు, మీకు సినిమాలు చూడడం రాదు. నా ఇష్టం, నేనిలాగే సినిమాలు తీస్తానంటే, రామ్‌గోపాల్ వర్మని మర్చిపోయినట్టే తెలుగు ప్రేక్షకులు సుకుమార్‌ని కూడ మర్చిపోతారు.

చివరిలో హీరో ఒక రైమ్ సహాయంతో తన ఇంటిని వెదుక్కునే సీన్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఆ సీన్‌తో సినిమా మొదలుపెట్టిఉంటే సినిమా ఫీల్ వేరేగా ఉండేది.

ఇన్ని కబుర్లు చెబుతున్నావ్, సినిమాల గురించి నీకేం తెలుసు అంటారా? థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్త్రీ అండి! తెలుగు సినీ ప్రేక్షకుడిగా ముప్పయ్యేళ్ళ అనుభవం ఉంది నాకు. ఇంకేం కావాలి?


సౌందర్య మళ్ళీ పుట్టిందా? (30-12-2013)

avika4

ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ అవికా గోర్, అదే ఆనందిని చూసిన తరువాత నాకు సౌందర్య మళ్ళీ పుట్టిందనే అనిపించింది. నేను మరీ, చాలా… ఎక్కువ చేసి చెపుతున్నానని ఇప్పుడు అనుకోవచ్చు. కాని మరో మూడు నాలుగేళ్ళ తరువాత నా ఊహ కరక్టని ఒప్పుకుంటారు. సౌందర్య తరువాత ఇంత డీసెంట్‌గా, క్యూట్‌గా, అమాయకంగా కనిపించే హీరోయిన్‌ని తెలుగు సినిమాలలో చూడలేదు. చాలా సన్నివేశాల్లో పాత్రకి తగినట్టు, మంచి హావభావాలు ప్రదర్శించింది. చిన్న వయసులోనే ఇంత బాగా చేసిన ఆనంది, భవిష్యత్తులో ఇంకా బాగా నటించగలదనిపిస్తోంది. సాధారణంగా బాలతారలు పెద్దయ్యాకా మంచి నటీనటులవుతారు. ఇందుకు శ్రీదేవి, మీనా లాంటి వాళ్ళే ఉదాహరణలు.

soundarya

సౌందర్య కూడ తెలుగు సినిమాలకి వచ్చిన కొత్తల్లో, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాలలో ఇటువంటి సింపుల్ పాత్రలలోనే కనిపించింది. తరువాత ఆమెకి పెద్ద సినిమాలలో, మంచి నటనకి అవకాశం ఉన్న పాత్రలు వచ్చినపుడు తానేమిటో నిరూపించుకుంది. అవికా గోర్‌కి కూడ సరైన అవకాశాలు వచ్చి, మంచి సినిమాలు ఎన్నుకుని చేస్తే భవిష్యత్తులో సౌందర్య స్థాయికి చేరుకోగలదు.

avika3

ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే, మంగమ్మ గారి మనవడు + నువ్వే కావాలి = ఉయ్యాల జంపాల. డైలాగులు బాగా పేలాయి. పాటలు పరవాలేదు. సినిమాని డీసెంట్‌గా తీసినందుకు దర్శక నిర్మాతలని అభినందించాలి. హీరో హీరోయిన్లు చాలా బాగా చేసారు. రాజ్ తరుణ్ డైలాగ్ డెలివరీ పాత్రకి సరిగ్గా సరిపోయింది. దర్శకుడు సినిమాని సహజంగా, ఎక్కడా బోరు కొట్టకుండా తీసాడు. ఒకసారి తప్పక చూడదగ్గ సినిమా. మా గోదారోళ్ళు అయితే రెండో సారి కూడ చూడచ్చు.

కాని సినిమా అంతా అయిపోయాక, ఇదేమిటి? సినిమా ఇంత సింపుల్‌గా ఉంది! అని అనిపించకమానదు. ఇది చిన్న సినిమా అయినా, అంత పెద్ద నిర్మాతలు ఇంత చౌకగా, టెలీ ఫిలింకి కాస్త ఎక్కువగా ఎలా తీసారని అనుమానం వస్తుంది. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదో షార్ట్ ఫిలింకో, డాక్యుమెంటరీకో చేసినట్టుగా ఉంది. హీరో హీరోయిన్లు వాళ్ళ పాత్రలకి సరిపోయినా, మిగతా పాత్రలకి కాస్త పేరున్న నటీనటులని పెట్టుకుని, ఇంకొంచెం రిచ్‌గా సినిమా తీసి ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద హిట్టయ్యేది.


అత్తారింటికి దారేది? (09-08-2013)

త్వరలో వస్తున్న అత్తారింటికి దారేది.. సినిమాలోని డైలాగులు చాలా పాపులర్ అయ్యాయి.

అందులోని ఒక డైలాగుపై నా కామెంటుని సరదాగా ఇలా.. చూడండి.

attarintiki-daredi

త్రివిక్రం తన సినిమాలకి తానే మాటలు వ్రాసుకుంటాడు కాబట్టి కావాలనే ఇలా వ్రాసుకున్నాడా?

ఏమో? పవన్ అభిమానులే చెప్పాలి.

JUST FOR FUN..



రెండు గుండెల మైథునం (17-03-2013)


ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని చాలా ఎదురు చూసాను. ఆఖరికి డివిడి వచ్చేవరకు చూడడం కుదరలేదు. బెంగళూరులో “మహంకాళి” లాంటి సినిమాలు కూడ రిలీజ్ చేసారు కాని “మిథునం” సినిమా ఇప్పటివరకు రాలేదు. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల మధ్య కాకుండా ఇంట్లోనే చూడాల్సివచ్చింది.

కథని సినిమాగానో, టివి సీరియల్‌గానో తీయడం కత్తిమీద సాము లాంటిది. వంశీపసలపూడి కథలు టివిలో సరిగ్గా చూపించలేకపోయారు. మిథునం లాంటి అద్భుతమైన కథ వ్రాసినందుకు శ్రీరమణ గారి జన్మ ధన్యమైతే, ఆ కథని అంతే అద్భుతంగా సినిమా తీసినందుకు భరణి గారి జన్మ ధన్యమయ్యింది. భరణి గారిలో ఇంత మంచి దర్శకుడు, మంచి రచయిత ఉన్నాడని నాకు తెలియదు. ప్రేమకథ అంటే కేవలం యువతీయువకుల కథే చూపించనక్కరలేదు, అమ్మానాన్నల కథని కూడ చక్కని ప్రేమకథగా చూపించవచ్చని నిరూపించారు. ఏ వయసులోనైనా కొనసాగేది రెండు మనసుల మైథునం మాత్రమే అని, అదే అర్థనారీశ్వరతత్వమని చక్కగా చెప్పారు. జీవితభాగస్వామిని ఎంచుకునేటప్పుడు, యువతీయువకులు అయిదేళ్ళు, పదేళ్ళ కోసం కాకుండ యాభై ఏళ్ళ సాహచర్యం కోసం ఎంచుకోవాలన్న సందేశం ఉంది.

అల గేటెడ్ కమ్యూనిటి పురంబులో, ఆ మూల అపార్ట్‌మెంటు సౌధంబులో, పద్నాల్గవ అంతస్థులోని మూడు బెడ్ రూముల లగ్జరీ ఫ్లాట్‌లో బ్రతకడమే సౌఖ్యం కాదని మట్టితో బ్రతుకుతూ, ప్రకృతితో మమేకవడమే పరమసుఖమని చెప్పారు. శ్రమైక జీవన సౌందర్యానికి వయసు అడ్డం కాదని చూపించారు. ఈ సినిమాలో రేడియో ఉంటుంది కాని టివి ఉండదు. ఇదివరకు రేడియో వింటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు టివి వచ్చాక సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి మరీ టివి చూస్తున్నారు. అప్పదాసు ఇల్లే ఒక పెద్ద థియేటరు. ఇక వాళ్ళకి హోం థియేటర్ ఎందుకు? ఈ సినిమా ఒక డ్రీం రిటైర్మెంట్. ఒక ఫాంటసీ వానప్రస్థం.

సినిమా ప్రారంభంలోనే వందేమాతరం పాట వినిపిస్తూ అమ్మా నాన్నల పాదాలు మాత్రమే చూపించడం బాగుంది. ఇక అక్కడనుంచి అప్పదాసు తిండి యావ (బహుశా అప్పదాసు దృష్టిలో అది ఒక కళ), వాళ్ళిద్దరి మధ్యన జరిగే సరదా సంఘటనలు, చిలిపి తగాదాలు, ప్రేమ కబుర్లు, అలకలు, అనుభూతులు, మాటలు, పాటలు అన్నీ కథలో ఉన్నవే కాకుండ మరిన్ని జోడించి మంచి విందు భోజనం తిన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. చివరికి అప్పదాసు మరణంతో సినిమా చూస్తున్న వాళ్ళ హృదయం, కన్నులు చెమ్మగిల్లకమానవు.

నాకు బాగా నచ్చింది ఈ సినిమాలోని డైలాగులు. కథలోని మాటలు ఇంచుమించు అన్నీ ఉంచుతూనే మరిన్ని మాటలు భరణి చక్కగా కలిపారు. జంధ్యాల గారి తర్వాత సినిమాల్లో చక్కని తెలుగు మాటలు వ్రాసేవాళ్ళే కరువయ్యారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో, అన్నీ పంచ్ డైలాగులే కాని మంచి డైలాగులు ఉండటంలేదు. భరణి గారు మరిన్ని మంచి సినిమాలకి మాటలు వ్రాస్తే బాగుంటుంది.

బుచ్చి లక్ష్మి పాత్రకి లక్ష్మి చక్కగా సరిపోయింది. బాలు ఎక్కడైనా కొంచెం ఎక్కువ చెసి ఉండచ్చు కాని, లక్ష్మి చాలా బాగా చేసింది. ఈ పాత్రకి ఇంతకంటే న్యాయం చెయ్యగలిగేది బహుశా షావుకారు జానకి మాత్రమే అని నా అభిప్రాయం. బాలు తన పాత్రని బాగా “ఇష్టపడి” చేసినట్టు అనిపించింది. బెల్లం ముక్క కొడుతూ వేలుకి దెబ్బ తగిలించుకుని, కట్టు కట్టిన తరువాత భార్యని మళ్ళీ బెల్లం ముక్క అడిగేటప్పుడు బాలు అమాయకపు నటన అద్భుతః. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఈ పాత్రని చంద్రమోహన్ పోషించి ఉంటే ఇంకా సహజంగా ఉండేదనిపించింది. రెండోసారి చూసినపుడు జంధ్యాల సినిమాల్లో నటించిన కీ. శే. పుచ్చా పూర్ణానందం గుర్తొచ్చారు. ఆయన శరీరం, వాచకం ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాయనిపించింది.

కథలోని ఒక కీలకమైన సన్నివేశం, ఫ్లాష్‌బాక్‌లో పెళ్ళి పల్లకీలో వధూవరులు వేరుశనక్కాయలు పంచుకోవడం. అది కూడ సినిమాలో పెట్టి ఉంటే బాగుండేది. చేంతాడు యాభై ఏళ్ళ తరువాత తెగడం, అంత పెద్ద బాలు నూతిలో దూకి పైకి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. అలాగే భార్యని దొంగముంజ అనడం అవసరమా? చిన్న చిన్న లోపాలున్నా వదిలేసి, ఇంత మంచి సినిమా తీసినందుకు చిత్ర నిర్మాణ భాగస్వాములందరినీ అభినందిద్దాము.


సీతమ్మ వాకిట్లో సంక్రాంతి సందడి. (13-01-2013)


సంక్రాంతి పండగకి కుటుంబసమేతంగా సినిమాకి వెళ్ళాలనుకుంటున్నరా? అయితే మీ ఇంటికి వచ్చిన బంధుమిత్ర సపరివారసమేతంగా ఈ సినిమాకి వెళ్ళచ్చు. ఈ సినిమా చూసిన తరువాత బాంధవ్యాలు బలపడతాయి. అపోహలు తగ్గుతాయి. హిందీలో రాజశ్రీ వాళ్ళ సినిమాలలో ఉండే ధనిక కుటుంబాలకి బదులు గ్రామీణ తెలుగు మధ్యతరగతి కుటుంబాన్ని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా. గతంలో వెంకటేష్ చేసిన “సంక్రాంతి” సినిమా కూడ గుర్తొస్తుంది. చితకబాదుడు ఫైట్లు, ఐటెం సాంగ్స్, మసాలా డైలాగులు లేని ఈ సినిమా చూస్తే కొన్ని దశాబ్దాల క్రితం బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టుంటుంది. నగరాల్లో బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు తినే వాళ్ళకి అమ్మ చేతి పెరుగన్నం ముద్ద రుచి గుర్తొస్తుంది.

అలాగని ఇది మరీ గొప్ప సినిమా ఏమీ కాదు. కాని ఒక డిఫరెంట్ సినిమా. ఈగో లని పక్కనపెట్టి ఇంత సింపుల్‌గా సినిమాలో నటించిన వెంకటేష్, మహేష్‌లని ముందుగా అభినందించాలి. మహేష్‌బాబు “బిజినెస్‌మేన్” లాంటి సినిమాలో నటించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ సినిమాలో నటించాడు అనుకుంటున్నాను. అలాగే శ్రీరామరాజ్యం, రాజన్న లాంటి సినిమాలు గొప్పగా ఆడకపోయినా, ఎటువంటి మసాలాలు లేని సినిమా తీసిన నిర్మాతని కూడ అభినందించాలి.

ఎంతోమంది నటీనటులున్న ఈ సినిమాలో అందరూ తమ శక్తిమేరకు బాగా చేసారు. మల్టీ స్టారర్ సినిమాలలో అన్ని పాత్రలకి సరైన న్యాయం జరగడం కష్టమే.ఇందులో దర్శకుడు అన్నిటికంటే ఎక్కువగా సీత పాత్రని ప్రేమించినట్టు కనపడుతుంది. ఆమె చిన్న చిన్న అనుభూతులు కూడ సున్నితంగా చూపించాడు. ఆ పాత్రలో అంజలి చాలా బాగా చేసింది. మాటలు చాల చోట్ల బాగున్నాయి. పాటలు కూడ విన్నదానికంటే సినిమాలో ఇంకా బాగున్నాయి. మహేష్‌బాబుని ఎప్పుడు ఎంతో గ్లామరస్‌గా చూసే యువత ఈ సినిమాలో “మిడిల్‌క్లాస్” మహేష్‌బాబుని చూసి కొంత నిరాశపడచ్చు. వెంకటేష్, మహేష్‌బాబులు ఎడమొహం, పెడమొహంగా, మౌనంగా కూర్చునే సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి.

సినిమా నిడివి పెరిగిందని బ్రహ్మానందం పాత్రని మొత్తం తీసేసారని చదివాను. ఒక పావుగంట నిడివి పెరిగినా ఆ పాత్రని ఉంచితే సెకండ్ హాఫ్‌లో కూడ వినోదం పండేది. దానికి బదులు రవిబాబు పాత్రని తీసేసినా నష్టమేమీ లేదు. అలాగే ఈ సినిమాని దర్శకుడు సరిగ్గా ముగించలేదు. సినిమా అర్ధాంతరంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. బహుశా సీక్వెల్ తీస్తారేమో? ఇంత పెద్ద సినిమాని ఒక కొత్త దర్శకుడు చేస్తున్నప్పుడు, ఎవరైనా ఒక సీనియర్ దర్శకుడు పర్యవేక్షిస్తే బాగుండేది. తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అనకుండా, కొన్ని లోపాలున్నా, ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ప్రోత్సహించాలి.

 

ఈగ – చిరంజీవి స్టయిల్లో.. (28-07-2012)

ఈగ, చిరంజీవి స్టయిల్లో డైలాగు చెపితే ఎలా ఉంటుందో చదవండి (సరదాగా) ఈ బొమ్మలో.

 

 

కంగ్రాట్స్ టు రాజమౌళి & టీం.


బిజినెస్‌మేన్ – వై దిస్ కొలవెరి, కొలవెరి, పూరీ.. (21-01-2012)


బిజినెస్‌మేన్ సినిమా చూసాకా, నాకు ముందుగా ఈ కొలవెరి పాట గుర్తొచ్చింది. పూరీ జగన్నాథ్, ప్రతీ సినిమాకీ ప్రేక్షకులు ఊహించని షాకులు ఇస్తాడని తెలుసు కానీ, ఇన్ని షాకులు ఇస్తాడని ఊహించలేదు. దర్శకుడు తనలోని ఆవేశాన్నీ, కసిని (కొలవెరి అనచ్చా?) ఇంత రఫ్‌గా, నెగటివ్‌గా చూపించడం అవసరమా? ఈ సినిమా ఎలా ఉందంటే, పోసాని డైలాగులు వ్రాసిన రాంగోపాల్‌వర్మ సినిమాలా ఉంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌కైనా కొలవెరి అని పేరు పెడితే బాగుండేది.

ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని మహేష్ ఒప్పుకోవడం ఆశ్చర్యమే. ఇలాంటి పాత్రలు పక్కా మాస్ హీరోలైన రవితేజ, గోపీచంద్ లాంటి వాళ్ళకి పరవాలేదేమో. నాకైతే పూరీ, తన సినిమాలన్నీ రవితేజ కోసం వ్రాసుకున్నట్లే అనిపిస్తుంది.

తెలుగు సినిమా కథకి పెద్దగా లాజిక్కులుండవు కానీ, మరీ ఇంతగా లాజిక్, రీజనింగ్ ఏమీ లేని సినిమాని ఈ మధ్య చూడలేదు. ఇందులో హీరో ఏమి చేయాలనుకుంటే అది, తన ఇష్టమొచ్చినట్టు చేసేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో, దానికీ అర్థముండదు. ఈ సినిమాలో ఎడిటర్ ఎక్కువ పని చేసాడో, సెన్సార్ వాళ్ళు ఎక్కువ పని చేసారో చెప్పడం కష్టం. సెన్సార్ వాళ్ళు ఇదివరకు మాటలనే మ్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దృశ్యాలని కూడా బ్లర్ చేయాల్సివస్తోంది.

మిల్క్ బాయ్ లాంటి మహేష్ ఏమిటి? ఆ డైలాగులేమిటి? అభిమానులు ఎలా ఒప్పుకుంటారు?
మహేష్ బాబూ, ఇలాంటి డైలాగులు आप को शोभा नहीं देता.

ఇందులో కొన్ని స్ఫూర్తివంతమైన డైలాగులు ఉన్నా, అవి కూడా బూతుల్లో కొట్టుకుపోయాయి. హీరో చివరలో ఇచ్చే సందేశం ( ఏ లక్ష్యం లేని వాళ్ళు చచ్చిపోండి, సమాజానికి మీ అవసరం లేదు ) బాగున్నా, అది పాత్రోచితంగా లేదు. ఈ సందేశం విన్నాకా, నేను నా మొట్టమొదటి టపా ఆరంభం లో వ్రాసుకొన్న ఈ వాక్యం ( ఏమీ సాధించని జీవితం కంటే మృత శిశువుగా జన్మించడం ఉత్తమమా? ) గుర్తొచ్చింది.

ఖలేజా సినిమాలో ఇలాగే మహేష్ చేత అతిగా వాగించినందువల్లే ఎవడూ రెండోసారి చూడలేదు. దూకుడు సినిమాలో ఎక్కువ డైలాగులు ఉన్నా, శృతి మించలేదు కాబట్టి అందరికీ నచ్చింది. నిజానికి బిజినెస్‌మేన్ సినిమాకి దూకుడు అని పేరు పెట్టాల్సింది. ఇందులో మహేష్ ప్రతీ సీనులోనూ దూకుడుగానే ఉంటాడు.

పూరీ జగన్నాథ్ గారూ, మీలోని ఆవేశాన్నీ, కసినీ ఇలా కాకుండా పాజిటివ్‌గా ప్రజంట్ చేస్తే ఒక శంకర్ లాగా గ్రేట్ అనిపించుకొంటారు. మున్నా భాయి లాంటివాళ్ళు గాంధీగిరి చేస్తుంటే, మీ సూర్య, భాయి అవడం బాగుందా? మీరు కసితో లగాన్, చక్ దే ఇండియా లాంటి పాజిటివ్ సినిమాలు తియ్యండి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు.

యువతకి బ్రాండ్ అంటే అబ్దుల్ కలాం, అన్నా హజారే లాంటి వాళ్ళు కాని సూర్యా భాయ్ కాదు సార్. రాంగోపాల్‌వర్మ సినిమాలు తెలుగువాళ్ళు చూడడం మానేసారు. మీరూ ఇంకా అలాంటివే తీస్తే ఎలా? ఇందులో మహేష్ హీరో కాబట్టి ఒంటిచేత్తో సినిమాని లాక్కొచ్చాడు. మరో హీరో అయితే ఇంత హైప్ వచ్చేదే కాదు.


దూకుడు. మంచి సాంబారు లాంటి సినిమా. (05-10-2011)

కంగారు పడకండి, నేను మళ్ళీ రివ్యూ రాయడం లేదు. జస్ట్, నా కామెంట్స్ వ్రాస్తున్నాను అంతే. కాళేశ్వరరావు మార్కెటుకెళ్ళి, దొరికిన కూరగాయలు అన్నీ కొనుక్కొచ్చేసినట్టు, ఈ సినిమాకి కాల్షీట్లు దొరికిన నటీనటులందరినీ బుక్ చేసేసారు. అలాగే మార్కెటులో దొరికే అన్ని మసాలాలు, అంటే ప్రేక్షకులు కోరుకునే నవరసాలూ కలిపి కమ్మటి సాంబారు వండారు.
మొదటిలో పూరీ జగన్నాథ్ సినిమా చూసినట్టు ఉంది. అరగంట తరువాత, అంటే బ్రహ్మానందం ఎంటర్ అయ్యాకా, శ్రీను వైట్ల సినిమా ప్రారంభమవుతుంది. చాలాసేపు ఇద్దరు దర్శకుల సినిమాలు రెండూ, పారలల్ గా చూస్తున్నట్టు ఉంది. ఇంటర్వెల్ తరువాత పూరీ స్టైల్ తగ్గుతూ శ్రీను స్టైలులో సినిమా ముగుస్తుంది.
అన్నట్టు మరో దర్శకుడు కూడా మనకి గుర్తొస్తాడు. అతనే త్రివిక్రం. డైలాగులన్నీ త్రివిక్రం పంచ్ స్టైల్లోనే ఉన్నాయి. అయితే ఖలేజాలో వాగించినంత అతిగా లేకపోవడం బాగుంది.
మహేష్ అభిమానులకి ఈ సినిమా పండగే. అన్నిరకాల సీన్లూ చాలా ఈజీగా చేసేసాడు.
గ్లామరుతో చంపేసాడు. మహేష్ ఇలాగే టీనేజిలో ఫిక్స్ అయిపోతే హీరొయిన్లు దొరకడం కష్టం. ఈ సినిమాలో డిజప్పాయింట్ చేసేది హీరోయిన్ సమంతా ఒక్కటే. ఆమె డబ్బింగ్ కూడా ఘోరంగా ఉంది. మాస్ సినిమాలో గ్లామరస్ హీరోయిన్ అయితేనే బాగుంటుంది కదా. మహేష్ కలరుకి కాజల్ లేదా తమన్నా అయితేనే మేచ్ అవ్వచ్చు. కొంచెం ఖర్చయినా కత్రినా అయితే ఇంకా బెటర్.
తమన్ సంగీతం పరవాలేదు కాని, సినిమాని లిఫ్ట్ చేసే స్థాయిలో అయితే లేదు.
ప్రకాష్ రాజ్ లాంటి సీరియస్ నటుడిని తండ్రి పాత్రకి ఎన్నుకోవడం బాగోలేదు. ఆ పాత్రలో చెయ్యడానికేమీ లేదు. ఏదో రిటైర్మెంట్ అయినవాడు పార్ట్ టైం జాబ్ చేసినట్టు ఉంది.
బ్రహ్మానందం చాలా అలవాటైన పాత్రలో ఎప్పటిలాగానే ఇరగదీసాడు. ఒక డైలాగులో చెప్పినట్టు దర్శకుడు ఆయనని ఫుల్లుగా వాడుకున్నాడు.
ఎమ్మెస్ నారాయణకి ఇంత ముఖ్యమైన పాత్ర శ్రీను వైట్ల తప్ప ఎవరూ ఇవ్వరేమో. ఆయన బాగానే చేసినా, ఈ సారి మాత్రం ఈ పాత్రకి అలీ అయితే ఇంకా బాగుండేవాడేమో. అవార్డ్ ఫంక్షన్లలో మగధీర, గీతాంజలి లాంటి పేరడీ పాత్రలు బాగా చేసాడు కాబట్టి.
కనిపించిన కాసేపటికే చనిపోయే పాత్రలో రాజీవ్ కనకాల ఎన్ని సార్లు చేస్తాడో కాని, చూసి చూసి మనకు చిరాకేస్తుంది. NTR ని ప్రధానమంత్రిగా చూపించడం బాగానే ఉన్నా, మిగతావాళ్ళని కెలకడం అవసరమా?
ఇంక ఈ సినిమాతో శ్రీను వైట్లకి సక్సెస్ ఫార్ములా అర్థమయ్యుంటుంది. నిజానికి అదేమీ రాకెట్ సైన్స్ కాదు. సినిమా చూసినంతసేపూ బోరు కొట్టకుండా ఉంటే చాలు అంతే.
నా ఫైనల్ కామెంట్ ఏమిటంటే, సగటు ప్రేక్షకుడిలా ఈ సినిమాని చూస్తే చక్కగా ఎంజాయ్ చెయ్యచ్చు. అన్నట్టు చివరిలో ఒక మంచి నీతివాక్యం కూడా చెప్పారు.