Friday 20 November 2015

సాగర సంగమం - సరికొత్తగా...


సాగర సంగమం సినిమా విడుదలై ఇప్పటికి ముప్పయ్యేళ్ళు దాటింది. కళాతపస్వి విశ్వనాథ్ దర్శకత్వం, కమల్ హాసన్, జయప్రదల అద్భుత నటన, ఇళయరాజా - వేటూరిల మధురమైన పాటలు, జంధ్యాల మాటలు, ఈ చిత్రాన్ని భారతీయ చిత్రాల్లోనే గొప్పవైన 100 చిత్రాల్లో ఒకటిగా నిలబెట్టాయి.

సాగర సంగమం సినిమా చేసేటప్పటికి కమల్ వయసు ముప్పయ్యేళ్ళ లోపే. ఇప్పుడు కమల్ వయసు అరవయ్యేళ్ళ పైనే. అయినా కమల్ హాసన్ ఇంకా హీరోగా నటిస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు. ఇన్నాళ్ళ తన నటప్రస్థానంలో కమల్ అందుకోని అవార్డు, రివార్డు ఏమీ లేదనే చెప్పాలి. సాగర సంగమం సినిమాలో కమల్ పాతికేళ్ళ యువకుడిగా కొంతసేపూ, సుమారు అరవయ్యేళ్ళ పెద్దవాడిగా కొంతసేపూ కనిపిస్తాడు. సినిమా నిడివి పరంగా చూస్తే రెండు పాత్రలకి ఇంచుమించు సమానమయిన వ్యవధి ఉంటుంది. రెండు వయసుల పాత్రల్లోనూ కమల్ చక్కగా ఒదిగిపోయి అద్భుతంగా నటించాడు.

తెలుగువాళ్ళందరూ ఈ సినిమాని కొన్ని డజన్ల సార్లు చూసి ఉంటారు. అలాగే నేను కూడ ఎన్నో సార్లు చూసాను. అలా ఈ మధ్య మరోసారి టివిలో ఈ సినిమా చూస్తున్నపుడు నాకో సరదా ఆలోచన వచ్చింది. ఎందువల్లనంటే ఈ మధ్య ఏదో సినిమాకి వెళ్ళినప్పుడు కమల్ కొత్త సినిమా "చీకటి రాజ్యం" ట్రైలర్ చూపించాడు. అది చూసినపుడు అయ్యో కమల్ ముసలివాడయిపోతున్నాడే అని అనిపించింది.
సాగర సంగమం సినిమాలో కమల్ సగం సేపు యువకుడుగా, మిగతా సగం వయసు మళ్ళినవాడుగా కనిపిస్తాడు కదా. అలాంటప్పుడు కమల్ యువకుడిగా ఉన్న భాగాన్ని అలాగే ఉంచేసి, కమల్ వయసుమళ్ళినవాడిగా ఉన్న భాగాన్ని ఇప్పటి కమల్‌తో పునర్నిర్మించి కలిపితే ఎలా ఉంటుంది? నాకయితే చాలా బాగుంటుందనిపించింది.
కమల్‌తో పాటు జయప్రద కూడ ఇప్పుడు వయసులో పెద్దదయిపోయింది. ఇప్పుడు ఆ తల్లి వయసు పాత్రకి జయప్రద సరిగ్గా సరిపోతుంది. అలాగే శరత్ బాబు కూడ తన పాత్ర తానే చెయ్యవచ్చు. శరత్ బాబు ఈ మధ్య ఎక్కువగా నటించడం లేదు. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారనుకుంటున్నాను. ఇక మిగిలిన ముఖ్యమైన పాత్ర, శైలజ పోషించిన జయప్రద కూతురు పాత్ర. ఇప్పుడు శైలజ ఆ పాత్రకి సరిపోదు కాబట్టి, కమల్ కూతురు శృతి హాసన్ అయితే బాగుంటుంది. నిజ జీవితంలో కమల్ కూతురు అయిన శృతి, సినిమాలో జయప్రద కూతురుగా నటిస్తే కమల్‌తో అనుబంధం బాగా వర్కవుటవుతుంది.
ఈ ఆలోచనని నా దగ్గరి స్నేహితులతో చర్చిస్తే, వాళ్ళకి అంతగా నచ్చలేదు. అప్పట్లోనే కమల్, జయప్రద ముసలివాళ్ళుగా బాగా చేసారు కదా, మళ్ళీ ఇప్పుడు రీషూట్ చెయ్యడం ఎందుకు? అన్నారు. నిజమే, అప్పుడే కమల్, జయప్రద చాలా బాగా చేసారు. కాని ఇప్పుడైతే వాళ్ళ శరీరం కూడ వయసుకు తగ్గట్టుగా కనపడుతుంది. మేకప్ పెద్దగా అవసరముండదు. జీవితానుభవం కూడ వాళ్ళ నటనలో మరింత సహజత్వాన్ని తెస్తుంది. అన్నింటిని మించి ఇది ఒక కొత్త ప్రయోగంలా ఉంటుందని నా అభిప్రాయం. కమల్ కూడ తన సినిమాలతో ఇలా ఎన్నో ప్రయోగాలు చేసాడు. ఇది మరో ప్రయోగం అవుతుంది. ఇలాంటి ప్రక్రియ మన దేశంలో కాని, విదేశాల్లో కాని ఎవరైనా చేసారో లేదో తెలియదు. సాగర సంగమం సినిమాతో ఈ ప్రయోగం చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మీరేమంటారు?