Tuesday, 25 November 2014
“1” కాదు “ఆర్య – 3″ (20-01-2014)
“1 నేనొక్కడినే” సినిమాని అందరూ చూసి వాళ్ళ అభిప్రాయం చెప్తుంటే, నేనొక్కడినే ఎందుకు చూడకూడదని, “ఎవడు” లాంటి రొటీన్ సినిమా చూసే ఓపిక లేక, ధైర్యం చేసి నిన్న ఈ సినిమా చూసాను. మొదటి సగం బాగా విసుగేసింది. రెండో సగం పరవాలేదు. నాకైతే ఈ సినిమా అల్లు అర్జున్‌తో తీసి ఉంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఒకో హీరోకి ఒకో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ కథతో సినిమా చేస్తేనే జనం సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు. “గీతాంజలి” సినిమా చిరంజీవి చేస్తే చండాలంగా ఉంటుంది. అలాగే చిరంజీవి స్టార్ కాకముందు చేసిన “శుభలేఖ” లాంటి సినిమాలు హిట్టయ్యాయి. స్టార్ అయ్యక ఇష్టపడి చేసిన “రుద్రవీణ”, “ఆరాధన”, “స్వయంకృషి”, ఆపద్బాంధవుడు” లాంటి మంచి సినిమాలు హిట్టవ్వలేదు.
ఏ హీరోకి ఎలాంటి కథ సూటవుతుందో రాజమౌళి సినిమాలు చూసి కొత్త దర్శకులు తెలుసుకోవచ్చు. రామ్ చరణ్ కి “మగధీర” కంటే సరిపోయే కథ ప్రస్తుతం ఉండదు. సునీల్‌కి “మర్యాదరామన్న” అంతే. “ఆరెంజ్” సినిమా రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్‌కే బాగుంటుంది. “బద్రీనాథ్” సినిమా అల్లు అర్జున్ కంటే ప్రభాస్‌కో, రామ్ చరణ్ కో బాగుంటుంది.
ఈ సినిమా మామూలు రొటీన్ తెలుగు సినిమా కాదు, డిఫరెంట్ సినిమా అని చెపుతున్నారు. డిఫరెంట్ అంటే తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, పాజిటివ్‌గా ఉంటే విభిన్నంగా (వైవిధ్యంగా) ఉంది అంటారు. రెండు, నెగటివ్‌గా ఉంటే తేడాగా ఉంది అంటారు. “అపరిచితుడు”, “గజిని” సినిమాలలో ఒక పాజిటివ్ పాయింట్ ఉండి, ఎక్కడా బోర్ కొట్టలేదు కాబట్టే ప్రేక్షకులకి నచ్చాయి. విభిన్నంగా ఉండే కథని ఏ హీరోతో అయినా చెయ్యవచ్చు. తేడాగా ఉండే కథకి అందరు హీరోలు సూటవ్వరు. ఇప్పటికే సుకుమార్ “ఆర్య” సినిమాని అల్లు అర్జున్‌తో రెండు సార్లు చేసి ప్రేక్షకులని ఒప్పించాడు కాబట్టి, ఈ సినిమాని కూడ అల్లు అర్జున్‌తో “ఆర్య – 3″ అని కంటిన్యూ చేసి ఉంటే ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకునేవారు.
మహేష్‌బాబు తన సినిమాలని ఒప్పుకోవడంలో జాగ్రత్త పడితే మంచిది. “బిజినెస్‌మేన్” లాంటి నెగిటివ్ సినిమా అతనికి సరిపడదు. “SVSC” మంచి సినిమాయే కాని, దర్శకుడు అనుభవం లేక సమగ్రంగా తియ్యలేకపోయాడు. అయినా మహేష్‌బాబు తన పాపులారిటీతో, నటనతో, అందంతో ఆ రెండు సినిమాలు హిట్ చేసాడు. ఎప్పుడూ క్యూట్‌గా ఉండే మహేష్ ఈ సినిమాలో స్లిమ్‌గా కూడ ఉన్నాడు. ఈ సినిమాలో కూడ మహేష్ చాలా బాగా చేసాడు. కాని ప్రేక్షకులు మహేష్ నుండి “దూకుడు” లాంటి నవరసాల వినోదాన్నే కోరుకుంటారు. ఏ సినిమా అయినా, సూపర్ డూపర్ హిట్టవ్వాలంటే, అభిమానులు మాత్రం చూస్తే సరిపోదు. అలాగే ఒకసారి చూసేలా ఉంటే కూడ సరిపోదు.
త్రివిక్రం మాటల్లో చెప్పాలంటే, కాంప్లాన్ బాయ్ లాంటి మహేష్‌బాబుని ఈ సినిమాలో సుకుమార్ కాంప్లికేటడ్ బాయ్ లా చూపించాడు. అసలు మనం సినిమా చూస్తున్నామా, లేక సినిమా చూస్తున్నట్టు ఊహించుకుంటున్నామా అని అనుమానం వస్తుంది. అన్ని ట్విస్టులతో సినిమాని నడిపించడం అవసరమా? కొంచెం సింప్లిఫై చేస్తే బాగుంటుంది కదా! అబ్బే! కాదు, మీకు సినిమాలు చూడడం రాదు. నా ఇష్టం, నేనిలాగే సినిమాలు తీస్తానంటే, రామ్‌గోపాల్ వర్మని మర్చిపోయినట్టే తెలుగు ప్రేక్షకులు సుకుమార్‌ని కూడ మర్చిపోతారు.
చివరిలో హీరో ఒక రైమ్ సహాయంతో తన ఇంటిని వెదుక్కునే సీన్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఆ సీన్‌తో సినిమా మొదలుపెట్టిఉంటే సినిమా ఫీల్ వేరేగా ఉండేది.
ఇన్ని కబుర్లు చెబుతున్నావ్, సినిమాల గురించి నీకేం తెలుసు అంటారా? థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్త్రీ అండి! తెలుగు సినీ ప్రేక్షకుడిగా ముప్పయ్యేళ్ళ అనుభవం ఉంది నాకు. ఇంకేం కావాలి?
సౌందర్య మళ్ళీ పుట్టిందా? (30-12-2013)
ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ అవికా గోర్, అదే ఆనందిని చూసిన తరువాత నాకు సౌందర్య మళ్ళీ పుట్టిందనే అనిపించింది. నేను మరీ, చాలా… ఎక్కువ చేసి చెపుతున్నానని ఇప్పుడు అనుకోవచ్చు. కాని మరో మూడు నాలుగేళ్ళ తరువాత నా ఊహ కరక్టని ఒప్పుకుంటారు. సౌందర్య తరువాత ఇంత డీసెంట్‌గా, క్యూట్‌గా, అమాయకంగా కనిపించే హీరోయిన్‌ని తెలుగు సినిమాలలో చూడలేదు. చాలా సన్నివేశాల్లో పాత్రకి తగినట్టు, మంచి హావభావాలు ప్రదర్శించింది. చిన్న వయసులోనే ఇంత బాగా చేసిన ఆనంది, భవిష్యత్తులో ఇంకా బాగా నటించగలదనిపిస్తోంది. సాధారణంగా బాలతారలు పెద్దయ్యాకా మంచి నటీనటులవుతారు. ఇందుకు శ్రీదేవి, మీనా లాంటి వాళ్ళే ఉదాహరణలు.
సౌందర్య కూడ తెలుగు సినిమాలకి వచ్చిన కొత్తల్లో, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాలలో ఇటువంటి సింపుల్ పాత్రలలోనే కనిపించింది. తరువాత ఆమెకి పెద్ద సినిమాలలో, మంచి నటనకి అవకాశం ఉన్న పాత్రలు వచ్చినపుడు తానేమిటో నిరూపించుకుంది. అవికా గోర్‌కి కూడ సరైన అవకాశాలు వచ్చి, మంచి సినిమాలు ఎన్నుకుని చేస్తే భవిష్యత్తులో సౌందర్య స్థాయికి చేరుకోగలదు.
ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే, మంగమ్మ గారి మనవడు + నువ్వే కావాలి = ఉయ్యాల జంపాల. డైలాగులు బాగా పేలాయి. పాటలు పరవాలేదు. సినిమాని డీసెంట్‌గా తీసినందుకు దర్శక నిర్మాతలని అభినందించాలి. హీరో హీరోయిన్లు చాలా బాగా చేసారు. రాజ్ తరుణ్ డైలాగ్ డెలివరీ పాత్రకి సరిగ్గా సరిపోయింది. దర్శకుడు సినిమాని సహజంగా, ఎక్కడా బోరు కొట్టకుండా తీసాడు. ఒకసారి తప్పక చూడదగ్గ సినిమా. మా గోదారోళ్ళు అయితే రెండో సారి కూడ చూడచ్చు.
కాని సినిమా అంతా అయిపోయాక, ఇదేమిటి? సినిమా ఇంత సింపుల్‌గా ఉంది! అని అనిపించకమానదు. ఇది చిన్న సినిమా అయినా, అంత పెద్ద నిర్మాతలు ఇంత చౌకగా, టెలీ ఫిలింకి కాస్త ఎక్కువగా ఎలా తీసారని అనుమానం వస్తుంది. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదో షార్ట్ ఫిలింకో, డాక్యుమెంటరీకో చేసినట్టుగా ఉంది. హీరో హీరోయిన్లు వాళ్ళ పాత్రలకి సరిపోయినా, మిగతా పాత్రలకి కాస్త పేరున్న నటీనటులని పెట్టుకుని, ఇంకొంచెం రిచ్‌గా సినిమా తీసి ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద హిట్టయ్యేది.
రెండు గుండెల మైథునం (17-03-2013)
ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని చాలా ఎదురు చూసాను. ఆఖరికి డివిడి వచ్చేవరకు చూడడం కుదరలేదు. బెంగళూరులో “మహంకాళి” లాంటి సినిమాలు కూడ రిలీజ్ చేసారు కాని “మిథునం” సినిమా ఇప్పటివరకు రాలేదు. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల మధ్య కాకుండా ఇంట్లోనే చూడాల్సివచ్చింది.
కథని సినిమాగానో, టివి సీరియల్‌గానో తీయడం కత్తిమీద సాము లాంటిది. వంశీపసలపూడి కథలు టివిలో సరిగ్గా చూపించలేకపోయారు. మిథునం లాంటి అద్భుతమైన కథ వ్రాసినందుకు శ్రీరమణ గారి జన్మ ధన్యమైతే, ఆ కథని అంతే అద్భుతంగా సినిమా తీసినందుకు భరణి గారి జన్మ ధన్యమయ్యింది. భరణి గారిలో ఇంత మంచి దర్శకుడు, మంచి రచయిత ఉన్నాడని నాకు తెలియదు. ప్రేమకథ అంటే కేవలం యువతీయువకుల కథే చూపించనక్కరలేదు, అమ్మానాన్నల కథని కూడ చక్కని ప్రేమకథగా చూపించవచ్చని నిరూపించారు. ఏ వయసులోనైనా కొనసాగేది రెండు మనసుల మైథునం మాత్రమే అని, అదే అర్థనారీశ్వరతత్వమని చక్కగా చెప్పారు. జీవితభాగస్వామిని ఎంచుకునేటప్పుడు, యువతీయువకులు అయిదేళ్ళు, పదేళ్ళ కోసం కాకుండ యాభై ఏళ్ళ సాహచర్యం కోసం ఎంచుకోవాలన్న సందేశం ఉంది.
అల గేటెడ్ కమ్యూనిటి పురంబులో, ఆ మూల అపార్ట్‌మెంటు సౌధంబులో, పద్నాల్గవ అంతస్థులోని మూడు బెడ్ రూముల లగ్జరీ ఫ్లాట్‌లో బ్రతకడమే సౌఖ్యం కాదని మట్టితో బ్రతుకుతూ, ప్రకృతితో మమేకవడమే పరమసుఖమని చెప్పారు. శ్రమైక జీవన సౌందర్యానికి వయసు అడ్డం కాదని చూపించారు. ఈ సినిమాలో రేడియో ఉంటుంది కాని టివి ఉండదు. ఇదివరకు రేడియో వింటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు టివి వచ్చాక సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి మరీ టివి చూస్తున్నారు. అప్పదాసు ఇల్లే ఒక పెద్ద థియేటరు. ఇక వాళ్ళకి హోం థియేటర్ ఎందుకు? ఈ సినిమా ఒక డ్రీం రిటైర్మెంట్. ఒక ఫాంటసీ వానప్రస్థం.
సినిమా ప్రారంభంలోనే వందేమాతరం పాట వినిపిస్తూ అమ్మా నాన్నల పాదాలు మాత్రమే చూపించడం బాగుంది. ఇక అక్కడనుంచి అప్పదాసు తిండి యావ (బహుశా అప్పదాసు దృష్టిలో అది ఒక కళ), వాళ్ళిద్దరి మధ్యన జరిగే సరదా సంఘటనలు, చిలిపి తగాదాలు, ప్రేమ కబుర్లు, అలకలు, అనుభూతులు, మాటలు, పాటలు అన్నీ కథలో ఉన్నవే కాకుండ మరిన్ని జోడించి మంచి విందు భోజనం తిన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. చివరికి అప్పదాసు మరణంతో సినిమా చూస్తున్న వాళ్ళ హృదయం, కన్నులు చెమ్మగిల్లకమానవు.
నాకు బాగా నచ్చింది ఈ సినిమాలోని డైలాగులు. కథలోని మాటలు ఇంచుమించు అన్నీ ఉంచుతూనే మరిన్ని మాటలు భరణి చక్కగా కలిపారు. జంధ్యాల గారి తర్వాత సినిమాల్లో చక్కని తెలుగు మాటలు వ్రాసేవాళ్ళే కరువయ్యారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో, అన్నీ పంచ్ డైలాగులే కాని మంచి డైలాగులు ఉండటంలేదు. భరణి గారు మరిన్ని మంచి సినిమాలకి మాటలు వ్రాస్తే బాగుంటుంది.
బుచ్చి లక్ష్మి పాత్రకి లక్ష్మి చక్కగా సరిపోయింది. బాలు ఎక్కడైనా కొంచెం ఎక్కువ చెసి ఉండచ్చు కాని, లక్ష్మి చాలా బాగా చేసింది. ఈ పాత్రకి ఇంతకంటే న్యాయం చెయ్యగలిగేది బహుశా షావుకారు జానకి మాత్రమే అని నా అభిప్రాయం. బాలు తన పాత్రని బాగా “ఇష్టపడి” చేసినట్టు అనిపించింది. బెల్లం ముక్క కొడుతూ వేలుకి దెబ్బ తగిలించుకుని, కట్టు కట్టిన తరువాత భార్యని మళ్ళీ బెల్లం ముక్క అడిగేటప్పుడు బాలు అమాయకపు నటన అద్భుతః. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఈ పాత్రని చంద్రమోహన్ పోషించి ఉంటే ఇంకా సహజంగా ఉండేదనిపించింది. రెండోసారి చూసినపుడు జంధ్యాల సినిమాల్లో నటించిన కీ. శే. పుచ్చా పూర్ణానందం గుర్తొచ్చారు. ఆయన శరీరం, వాచకం ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాయనిపించింది.
కథలోని ఒక కీలకమైన సన్నివేశం, ఫ్లాష్‌బాక్‌లో పెళ్ళి పల్లకీలో వధూవరులు వేరుశనక్కాయలు పంచుకోవడం. అది కూడ సినిమాలో పెట్టి ఉంటే బాగుండేది. చేంతాడు యాభై ఏళ్ళ తరువాత తెగడం, అంత పెద్ద బాలు నూతిలో దూకి పైకి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. అలాగే భార్యని దొంగముంజ అనడం అవసరమా? చిన్న చిన్న లోపాలున్నా వదిలేసి, ఇంత మంచి సినిమా తీసినందుకు చిత్ర నిర్మాణ భాగస్వాములందరినీ అభినందిద్దాము.
సీతమ్మ వాకిట్లో సంక్రాంతి సందడి. (13-01-2013)
సంక్రాంతి పండగకి కుటుంబసమేతంగా సినిమాకి వెళ్ళాలనుకుంటున్నరా? అయితే మీ ఇంటికి వచ్చిన బంధుమిత్ర సపరివారసమేతంగా ఈ సినిమాకి వెళ్ళచ్చు. ఈ సినిమా చూసిన తరువాత బాంధవ్యాలు బలపడతాయి. అపోహలు తగ్గుతాయి. హిందీలో రాజశ్రీ వాళ్ళ సినిమాలలో ఉండే ధనిక కుటుంబాలకి బదులు గ్రామీణ తెలుగు మధ్యతరగతి కుటుంబాన్ని పెడితే ఎలా ఉంటుందో అలా ఉంటుందీ సినిమా. గతంలో వెంకటేష్ చేసిన “సంక్రాంతి” సినిమా కూడ గుర్తొస్తుంది. చితకబాదుడు ఫైట్లు, ఐటెం సాంగ్స్, మసాలా డైలాగులు లేని ఈ సినిమా చూస్తే కొన్ని దశాబ్దాల క్రితం బ్లాక్ అండ్ వైట్ సినిమా చూసినట్టుంటుంది. నగరాల్లో బిర్యానీలు, ఫ్రైడ్ రైసులు తినే వాళ్ళకి అమ్మ చేతి పెరుగన్నం ముద్ద రుచి గుర్తొస్తుంది.
అలాగని ఇది మరీ గొప్ప సినిమా ఏమీ కాదు. కాని ఒక డిఫరెంట్ సినిమా. ఈగో లని పక్కనపెట్టి ఇంత సింపుల్‌గా సినిమాలో నటించిన వెంకటేష్, మహేష్‌లని ముందుగా అభినందించాలి. మహేష్‌బాబు “బిజినెస్‌మేన్” లాంటి సినిమాలో నటించినందుకు ప్రాయశ్చిత్తంగా ఈ సినిమాలో నటించాడు అనుకుంటున్నాను. అలాగే శ్రీరామరాజ్యం, రాజన్న లాంటి సినిమాలు గొప్పగా ఆడకపోయినా, ఎటువంటి మసాలాలు లేని సినిమా తీసిన నిర్మాతని కూడ అభినందించాలి.
ఎంతోమంది నటీనటులున్న ఈ సినిమాలో అందరూ తమ శక్తిమేరకు బాగా చేసారు. మల్టీ స్టారర్ సినిమాలలో అన్ని పాత్రలకి సరైన న్యాయం జరగడం కష్టమే.ఇందులో దర్శకుడు అన్నిటికంటే ఎక్కువగా సీత పాత్రని ప్రేమించినట్టు కనపడుతుంది. ఆమె చిన్న చిన్న అనుభూతులు కూడ సున్నితంగా చూపించాడు. ఆ పాత్రలో అంజలి చాలా బాగా చేసింది. మాటలు చాల చోట్ల బాగున్నాయి. పాటలు కూడ విన్నదానికంటే సినిమాలో ఇంకా బాగున్నాయి. మహేష్‌బాబుని ఎప్పుడు ఎంతో గ్లామరస్‌గా చూసే యువత ఈ సినిమాలో “మిడిల్‌క్లాస్” మహేష్‌బాబుని చూసి కొంత నిరాశపడచ్చు. వెంకటేష్, మహేష్‌బాబులు ఎడమొహం, పెడమొహంగా, మౌనంగా కూర్చునే సీన్లు మాత్రం బోర్ కొట్టిస్తాయి.
సినిమా నిడివి పెరిగిందని బ్రహ్మానందం పాత్రని మొత్తం తీసేసారని చదివాను. ఒక పావుగంట నిడివి పెరిగినా ఆ పాత్రని ఉంచితే సెకండ్ హాఫ్‌లో కూడ వినోదం పండేది. దానికి బదులు రవిబాబు పాత్రని తీసేసినా నష్టమేమీ లేదు. అలాగే ఈ సినిమాని దర్శకుడు సరిగ్గా ముగించలేదు. సినిమా అర్ధాంతరంగా అయిపోయినట్టు అనిపిస్తుంది. బహుశా సీక్వెల్ తీస్తారేమో? ఇంత పెద్ద సినిమాని ఒక కొత్త దర్శకుడు చేస్తున్నప్పుడు, ఎవరైనా ఒక సీనియర్ దర్శకుడు పర్యవేక్షిస్తే బాగుండేది. తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అనకుండా, కొన్ని లోపాలున్నా, ఒక కొత్త ప్రయత్నాన్ని ప్రేక్షకులు ప్రోత్సహించాలి.
Subscribe to:
Posts (Atom)





