Tuesday, 25 November 2014

“1” కాదు “ఆర్య – 3″ (20-01-2014)


“1 నేనొక్కడినే” సినిమాని అందరూ చూసి వాళ్ళ అభిప్రాయం చెప్తుంటే, నేనొక్కడినే ఎందుకు చూడకూడదని, “ఎవడు” లాంటి రొటీన్ సినిమా చూసే ఓపిక లేక, ధైర్యం చేసి నిన్న ఈ సినిమా చూసాను. మొదటి సగం బాగా విసుగేసింది. రెండో సగం పరవాలేదు. నాకైతే ఈ సినిమా అల్లు అర్జున్‌తో తీసి ఉంటే బాగుండేదనిపించింది. ఎందుకంటే ఒకో హీరోకి ఒకో బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గ కథతో సినిమా చేస్తేనే జనం సరిగ్గా రిసీవ్ చేసుకుంటారు. “గీతాంజలి” సినిమా చిరంజీవి చేస్తే చండాలంగా ఉంటుంది. అలాగే చిరంజీవి స్టార్ కాకముందు చేసిన “శుభలేఖ” లాంటి సినిమాలు హిట్టయ్యాయి. స్టార్ అయ్యక ఇష్టపడి చేసిన “రుద్రవీణ”, “ఆరాధన”, “స్వయంకృషి”, ఆపద్బాంధవుడు” లాంటి మంచి సినిమాలు హిట్టవ్వలేదు.

ఏ హీరోకి ఎలాంటి కథ సూటవుతుందో రాజమౌళి సినిమాలు చూసి కొత్త దర్శకులు తెలుసుకోవచ్చు. రామ్ చరణ్ కి “మగధీర” కంటే సరిపోయే కథ ప్రస్తుతం ఉండదు. సునీల్‌కి “మర్యాదరామన్న” అంతే. “ఆరెంజ్” సినిమా రామ్ చరణ్ కంటే అల్లు అర్జున్‌కే బాగుంటుంది. “బద్రీనాథ్” సినిమా అల్లు అర్జున్ కంటే ప్రభాస్‌కో, రామ్ చరణ్ కో బాగుంటుంది.

ఈ సినిమా మామూలు రొటీన్ తెలుగు సినిమా కాదు, డిఫరెంట్ సినిమా అని చెపుతున్నారు. డిఫరెంట్ అంటే తెలుగులో రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, పాజిటివ్‌గా ఉంటే విభిన్నంగా (వైవిధ్యంగా) ఉంది అంటారు. రెండు, నెగటివ్‌గా ఉంటే తేడాగా ఉంది అంటారు. “అపరిచితుడు”, “గజిని” సినిమాలలో ఒక పాజిటివ్ పాయింట్ ఉండి, ఎక్కడా బోర్ కొట్టలేదు కాబట్టే ప్రేక్షకులకి నచ్చాయి. విభిన్నంగా ఉండే కథని ఏ హీరోతో అయినా చెయ్యవచ్చు. తేడాగా ఉండే కథకి అందరు హీరోలు సూటవ్వరు. ఇప్పటికే సుకుమార్ “ఆర్య” సినిమాని అల్లు అర్జున్‌తో రెండు సార్లు చేసి ప్రేక్షకులని ఒప్పించాడు కాబట్టి, ఈ సినిమాని కూడ అల్లు అర్జున్‌తో “ఆర్య – 3″ అని కంటిన్యూ చేసి ఉంటే ప్రేక్షకులు బాగానే రిసీవ్ చేసుకునేవారు. 

మహేష్‌బాబు తన సినిమాలని ఒప్పుకోవడంలో జాగ్రత్త పడితే మంచిది. “బిజినెస్‌మేన్” లాంటి నెగిటివ్ సినిమా అతనికి సరిపడదు. “SVSC” మంచి సినిమాయే కాని, దర్శకుడు అనుభవం లేక సమగ్రంగా తియ్యలేకపోయాడు. అయినా మహేష్‌బాబు తన పాపులారిటీతో, నటనతో, అందంతో ఆ రెండు సినిమాలు హిట్ చేసాడు. ఎప్పుడూ క్యూట్‌గా ఉండే మహేష్ ఈ సినిమాలో స్లిమ్‌గా కూడ ఉన్నాడు. ఈ సినిమాలో కూడ మహేష్ చాలా బాగా చేసాడు. కాని ప్రేక్షకులు మహేష్ నుండి “దూకుడు” లాంటి నవరసాల వినోదాన్నే కోరుకుంటారు. ఏ సినిమా అయినా, సూపర్ డూపర్ హిట్టవ్వాలంటే, అభిమానులు మాత్రం చూస్తే సరిపోదు. అలాగే ఒకసారి చూసేలా ఉంటే కూడ సరిపోదు.

త్రివిక్రం మాటల్లో చెప్పాలంటే, కాంప్లాన్ బాయ్ లాంటి మహేష్‌బాబుని ఈ సినిమాలో సుకుమార్ కాంప్లికేటడ్ బాయ్ లా చూపించాడు. అసలు మనం సినిమా చూస్తున్నామా, లేక సినిమా చూస్తున్నట్టు ఊహించుకుంటున్నామా అని అనుమానం వస్తుంది. అన్ని ట్విస్టులతో సినిమాని నడిపించడం అవసరమా? కొంచెం సింప్లిఫై చేస్తే బాగుంటుంది కదా! అబ్బే! కాదు, మీకు సినిమాలు చూడడం రాదు. నా ఇష్టం, నేనిలాగే సినిమాలు తీస్తానంటే, రామ్‌గోపాల్ వర్మని మర్చిపోయినట్టే తెలుగు ప్రేక్షకులు సుకుమార్‌ని కూడ మర్చిపోతారు.

చివరిలో హీరో ఒక రైమ్ సహాయంతో తన ఇంటిని వెదుక్కునే సీన్ మాత్రం నాకు చాలా నచ్చింది. ఆ సీన్‌తో సినిమా మొదలుపెట్టిఉంటే సినిమా ఫీల్ వేరేగా ఉండేది.

ఇన్ని కబుర్లు చెబుతున్నావ్, సినిమాల గురించి నీకేం తెలుసు అంటారా? థర్టీ ఇయర్స్ ఇన్ ఇండస్త్రీ అండి! తెలుగు సినీ ప్రేక్షకుడిగా ముప్పయ్యేళ్ళ అనుభవం ఉంది నాకు. ఇంకేం కావాలి?


No comments:

Post a Comment