Tuesday 25 November 2014

బిజినెస్‌మేన్ – వై దిస్ కొలవెరి, కొలవెరి, పూరీ.. (21-01-2012)


బిజినెస్‌మేన్ సినిమా చూసాకా, నాకు ముందుగా ఈ కొలవెరి పాట గుర్తొచ్చింది. పూరీ జగన్నాథ్, ప్రతీ సినిమాకీ ప్రేక్షకులు ఊహించని షాకులు ఇస్తాడని తెలుసు కానీ, ఇన్ని షాకులు ఇస్తాడని ఊహించలేదు. దర్శకుడు తనలోని ఆవేశాన్నీ, కసిని (కొలవెరి అనచ్చా?) ఇంత రఫ్‌గా, నెగటివ్‌గా చూపించడం అవసరమా? ఈ సినిమా ఎలా ఉందంటే, పోసాని డైలాగులు వ్రాసిన రాంగోపాల్‌వర్మ సినిమాలా ఉంది. ఈ సినిమా తమిళ వెర్షన్‌కైనా కొలవెరి అని పేరు పెడితే బాగుండేది.

ఇంత నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రని మహేష్ ఒప్పుకోవడం ఆశ్చర్యమే. ఇలాంటి పాత్రలు పక్కా మాస్ హీరోలైన రవితేజ, గోపీచంద్ లాంటి వాళ్ళకి పరవాలేదేమో. నాకైతే పూరీ, తన సినిమాలన్నీ రవితేజ కోసం వ్రాసుకున్నట్లే అనిపిస్తుంది.

తెలుగు సినిమా కథకి పెద్దగా లాజిక్కులుండవు కానీ, మరీ ఇంతగా లాజిక్, రీజనింగ్ ఏమీ లేని సినిమాని ఈ మధ్య చూడలేదు. ఇందులో హీరో ఏమి చేయాలనుకుంటే అది, తన ఇష్టమొచ్చినట్టు చేసేస్తాడు. ఎందుకు చేస్తున్నాడో, దానికీ అర్థముండదు. ఈ సినిమాలో ఎడిటర్ ఎక్కువ పని చేసాడో, సెన్సార్ వాళ్ళు ఎక్కువ పని చేసారో చెప్పడం కష్టం. సెన్సార్ వాళ్ళు ఇదివరకు మాటలనే మ్యూట్ చేసేవాళ్ళు. ఇప్పుడు దృశ్యాలని కూడా బ్లర్ చేయాల్సివస్తోంది.

మిల్క్ బాయ్ లాంటి మహేష్ ఏమిటి? ఆ డైలాగులేమిటి? అభిమానులు ఎలా ఒప్పుకుంటారు?
మహేష్ బాబూ, ఇలాంటి డైలాగులు आप को शोभा नहीं देता.

ఇందులో కొన్ని స్ఫూర్తివంతమైన డైలాగులు ఉన్నా, అవి కూడా బూతుల్లో కొట్టుకుపోయాయి. హీరో చివరలో ఇచ్చే సందేశం ( ఏ లక్ష్యం లేని వాళ్ళు చచ్చిపోండి, సమాజానికి మీ అవసరం లేదు ) బాగున్నా, అది పాత్రోచితంగా లేదు. ఈ సందేశం విన్నాకా, నేను నా మొట్టమొదటి టపా ఆరంభం లో వ్రాసుకొన్న ఈ వాక్యం ( ఏమీ సాధించని జీవితం కంటే మృత శిశువుగా జన్మించడం ఉత్తమమా? ) గుర్తొచ్చింది.

ఖలేజా సినిమాలో ఇలాగే మహేష్ చేత అతిగా వాగించినందువల్లే ఎవడూ రెండోసారి చూడలేదు. దూకుడు సినిమాలో ఎక్కువ డైలాగులు ఉన్నా, శృతి మించలేదు కాబట్టి అందరికీ నచ్చింది. నిజానికి బిజినెస్‌మేన్ సినిమాకి దూకుడు అని పేరు పెట్టాల్సింది. ఇందులో మహేష్ ప్రతీ సీనులోనూ దూకుడుగానే ఉంటాడు.

పూరీ జగన్నాథ్ గారూ, మీలోని ఆవేశాన్నీ, కసినీ ఇలా కాకుండా పాజిటివ్‌గా ప్రజంట్ చేస్తే ఒక శంకర్ లాగా గ్రేట్ అనిపించుకొంటారు. మున్నా భాయి లాంటివాళ్ళు గాంధీగిరి చేస్తుంటే, మీ సూర్య, భాయి అవడం బాగుందా? మీరు కసితో లగాన్, చక్ దే ఇండియా లాంటి పాజిటివ్ సినిమాలు తియ్యండి. అందరూ మిమ్మల్ని అభినందిస్తారు.

యువతకి బ్రాండ్ అంటే అబ్దుల్ కలాం, అన్నా హజారే లాంటి వాళ్ళు కాని సూర్యా భాయ్ కాదు సార్. రాంగోపాల్‌వర్మ సినిమాలు తెలుగువాళ్ళు చూడడం మానేసారు. మీరూ ఇంకా అలాంటివే తీస్తే ఎలా? ఇందులో మహేష్ హీరో కాబట్టి ఒంటిచేత్తో సినిమాని లాక్కొచ్చాడు. మరో హీరో అయితే ఇంత హైప్ వచ్చేదే కాదు.


No comments:

Post a Comment