Tuesday 25 November 2014

సౌందర్య మళ్ళీ పుట్టిందా? (30-12-2013)

avika4

ఉయ్యాల జంపాల సినిమాలో హీరోయిన్ అవికా గోర్, అదే ఆనందిని చూసిన తరువాత నాకు సౌందర్య మళ్ళీ పుట్టిందనే అనిపించింది. నేను మరీ, చాలా… ఎక్కువ చేసి చెపుతున్నానని ఇప్పుడు అనుకోవచ్చు. కాని మరో మూడు నాలుగేళ్ళ తరువాత నా ఊహ కరక్టని ఒప్పుకుంటారు. సౌందర్య తరువాత ఇంత డీసెంట్‌గా, క్యూట్‌గా, అమాయకంగా కనిపించే హీరోయిన్‌ని తెలుగు సినిమాలలో చూడలేదు. చాలా సన్నివేశాల్లో పాత్రకి తగినట్టు, మంచి హావభావాలు ప్రదర్శించింది. చిన్న వయసులోనే ఇంత బాగా చేసిన ఆనంది, భవిష్యత్తులో ఇంకా బాగా నటించగలదనిపిస్తోంది. సాధారణంగా బాలతారలు పెద్దయ్యాకా మంచి నటీనటులవుతారు. ఇందుకు శ్రీదేవి, మీనా లాంటి వాళ్ళే ఉదాహరణలు.

soundarya

సౌందర్య కూడ తెలుగు సినిమాలకి వచ్చిన కొత్తల్లో, ఎస్ వి కృష్ణారెడ్డి సినిమాలలో ఇటువంటి సింపుల్ పాత్రలలోనే కనిపించింది. తరువాత ఆమెకి పెద్ద సినిమాలలో, మంచి నటనకి అవకాశం ఉన్న పాత్రలు వచ్చినపుడు తానేమిటో నిరూపించుకుంది. అవికా గోర్‌కి కూడ సరైన అవకాశాలు వచ్చి, మంచి సినిమాలు ఎన్నుకుని చేస్తే భవిష్యత్తులో సౌందర్య స్థాయికి చేరుకోగలదు.

avika3

ఇక ఈ సినిమా కథ గురించి చెప్పాలంటే, మంగమ్మ గారి మనవడు + నువ్వే కావాలి = ఉయ్యాల జంపాల. డైలాగులు బాగా పేలాయి. పాటలు పరవాలేదు. సినిమాని డీసెంట్‌గా తీసినందుకు దర్శక నిర్మాతలని అభినందించాలి. హీరో హీరోయిన్లు చాలా బాగా చేసారు. రాజ్ తరుణ్ డైలాగ్ డెలివరీ పాత్రకి సరిగ్గా సరిపోయింది. దర్శకుడు సినిమాని సహజంగా, ఎక్కడా బోరు కొట్టకుండా తీసాడు. ఒకసారి తప్పక చూడదగ్గ సినిమా. మా గోదారోళ్ళు అయితే రెండో సారి కూడ చూడచ్చు.

కాని సినిమా అంతా అయిపోయాక, ఇదేమిటి? సినిమా ఇంత సింపుల్‌గా ఉంది! అని అనిపించకమానదు. ఇది చిన్న సినిమా అయినా, అంత పెద్ద నిర్మాతలు ఇంత చౌకగా, టెలీ ఫిలింకి కాస్త ఎక్కువగా ఎలా తీసారని అనుమానం వస్తుంది. బాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఏదో షార్ట్ ఫిలింకో, డాక్యుమెంటరీకో చేసినట్టుగా ఉంది. హీరో హీరోయిన్లు వాళ్ళ పాత్రలకి సరిపోయినా, మిగతా పాత్రలకి కాస్త పేరున్న నటీనటులని పెట్టుకుని, ఇంకొంచెం రిచ్‌గా సినిమా తీసి ఉంటే చిన్న సినిమా అయినా పెద్ద హిట్టయ్యేది.


No comments:

Post a Comment