Tuesday, 25 November 2014

రెండు గుండెల మైథునం (17-03-2013)


ఎప్పుడెప్పుడు ఈ సినిమా చూద్దామా అని చాలా ఎదురు చూసాను. ఆఖరికి డివిడి వచ్చేవరకు చూడడం కుదరలేదు. బెంగళూరులో “మహంకాళి” లాంటి సినిమాలు కూడ రిలీజ్ చేసారు కాని “మిథునం” సినిమా ఇప్పటివరకు రాలేదు. ఒక మంచి సినిమాని ప్రేక్షకుల మధ్య కాకుండా ఇంట్లోనే చూడాల్సివచ్చింది.

కథని సినిమాగానో, టివి సీరియల్‌గానో తీయడం కత్తిమీద సాము లాంటిది. వంశీపసలపూడి కథలు టివిలో సరిగ్గా చూపించలేకపోయారు. మిథునం లాంటి అద్భుతమైన కథ వ్రాసినందుకు శ్రీరమణ గారి జన్మ ధన్యమైతే, ఆ కథని అంతే అద్భుతంగా సినిమా తీసినందుకు భరణి గారి జన్మ ధన్యమయ్యింది. భరణి గారిలో ఇంత మంచి దర్శకుడు, మంచి రచయిత ఉన్నాడని నాకు తెలియదు. ప్రేమకథ అంటే కేవలం యువతీయువకుల కథే చూపించనక్కరలేదు, అమ్మానాన్నల కథని కూడ చక్కని ప్రేమకథగా చూపించవచ్చని నిరూపించారు. ఏ వయసులోనైనా కొనసాగేది రెండు మనసుల మైథునం మాత్రమే అని, అదే అర్థనారీశ్వరతత్వమని చక్కగా చెప్పారు. జీవితభాగస్వామిని ఎంచుకునేటప్పుడు, యువతీయువకులు అయిదేళ్ళు, పదేళ్ళ కోసం కాకుండ యాభై ఏళ్ళ సాహచర్యం కోసం ఎంచుకోవాలన్న సందేశం ఉంది.

అల గేటెడ్ కమ్యూనిటి పురంబులో, ఆ మూల అపార్ట్‌మెంటు సౌధంబులో, పద్నాల్గవ అంతస్థులోని మూడు బెడ్ రూముల లగ్జరీ ఫ్లాట్‌లో బ్రతకడమే సౌఖ్యం కాదని మట్టితో బ్రతుకుతూ, ప్రకృతితో మమేకవడమే పరమసుఖమని చెప్పారు. శ్రమైక జీవన సౌందర్యానికి వయసు అడ్డం కాదని చూపించారు. ఈ సినిమాలో రేడియో ఉంటుంది కాని టివి ఉండదు. ఇదివరకు రేడియో వింటూనే ఎవరి పనులు వాళ్ళు చేసుకునేవారు. ఇప్పుడు టివి వచ్చాక సోఫాలకి శిలాజాల్లా అతుక్కుపోయి మరీ టివి చూస్తున్నారు. అప్పదాసు ఇల్లే ఒక పెద్ద థియేటరు. ఇక వాళ్ళకి హోం థియేటర్ ఎందుకు? ఈ సినిమా ఒక డ్రీం రిటైర్మెంట్. ఒక ఫాంటసీ వానప్రస్థం.

సినిమా ప్రారంభంలోనే వందేమాతరం పాట వినిపిస్తూ అమ్మా నాన్నల పాదాలు మాత్రమే చూపించడం బాగుంది. ఇక అక్కడనుంచి అప్పదాసు తిండి యావ (బహుశా అప్పదాసు దృష్టిలో అది ఒక కళ), వాళ్ళిద్దరి మధ్యన జరిగే సరదా సంఘటనలు, చిలిపి తగాదాలు, ప్రేమ కబుర్లు, అలకలు, అనుభూతులు, మాటలు, పాటలు అన్నీ కథలో ఉన్నవే కాకుండ మరిన్ని జోడించి మంచి విందు భోజనం తిన్న ఫీలింగ్ కలుగుతుంది మనకి. చివరికి అప్పదాసు మరణంతో సినిమా చూస్తున్న వాళ్ళ హృదయం, కన్నులు చెమ్మగిల్లకమానవు.

నాకు బాగా నచ్చింది ఈ సినిమాలోని డైలాగులు. కథలోని మాటలు ఇంచుమించు అన్నీ ఉంచుతూనే మరిన్ని మాటలు భరణి చక్కగా కలిపారు. జంధ్యాల గారి తర్వాత సినిమాల్లో చక్కని తెలుగు మాటలు వ్రాసేవాళ్ళే కరువయ్యారు. ఇప్పుడు వచ్చే సినిమాల్లో, అన్నీ పంచ్ డైలాగులే కాని మంచి డైలాగులు ఉండటంలేదు. భరణి గారు మరిన్ని మంచి సినిమాలకి మాటలు వ్రాస్తే బాగుంటుంది.

బుచ్చి లక్ష్మి పాత్రకి లక్ష్మి చక్కగా సరిపోయింది. బాలు ఎక్కడైనా కొంచెం ఎక్కువ చెసి ఉండచ్చు కాని, లక్ష్మి చాలా బాగా చేసింది. ఈ పాత్రకి ఇంతకంటే న్యాయం చెయ్యగలిగేది బహుశా షావుకారు జానకి మాత్రమే అని నా అభిప్రాయం. బాలు తన పాత్రని బాగా “ఇష్టపడి” చేసినట్టు అనిపించింది. బెల్లం ముక్క కొడుతూ వేలుకి దెబ్బ తగిలించుకుని, కట్టు కట్టిన తరువాత భార్యని మళ్ళీ బెల్లం ముక్క అడిగేటప్పుడు బాలు అమాయకపు నటన అద్భుతః. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఈ పాత్రని చంద్రమోహన్ పోషించి ఉంటే ఇంకా సహజంగా ఉండేదనిపించింది. రెండోసారి చూసినపుడు జంధ్యాల సినిమాల్లో నటించిన కీ. శే. పుచ్చా పూర్ణానందం గుర్తొచ్చారు. ఆయన శరీరం, వాచకం ఈ పాత్రకి సరిగ్గా సరిపోతాయనిపించింది.

కథలోని ఒక కీలకమైన సన్నివేశం, ఫ్లాష్‌బాక్‌లో పెళ్ళి పల్లకీలో వధూవరులు వేరుశనక్కాయలు పంచుకోవడం. అది కూడ సినిమాలో పెట్టి ఉంటే బాగుండేది. చేంతాడు యాభై ఏళ్ళ తరువాత తెగడం, అంత పెద్ద బాలు నూతిలో దూకి పైకి ఎలా వచ్చాడో అర్థం కాలేదు. అలాగే భార్యని దొంగముంజ అనడం అవసరమా? చిన్న చిన్న లోపాలున్నా వదిలేసి, ఇంత మంచి సినిమా తీసినందుకు చిత్ర నిర్మాణ భాగస్వాములందరినీ అభినందిద్దాము.


No comments:

Post a Comment